Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ ఆరోపణలపై విచారణకు సిద్ధమైన ప్రభుత్వం

  • తన పిల్లల ఇన్ స్టా గ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయన్న ప్రియాంకా
  • సోషల్ మీడియాలో వేటాడుతోందంటూ ఆరోపణలు
  • ప్రభుత్వానికి మరో పని లేదా అంటూ విమర్శ
  • నిగ్గు తేల్చనున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్
Priyanka Gandhi Charge To Be Probed

తన పిల్లల ఇన్ స్టా గ్రామ్ ఖాతాలు హ్యాక్ కు గురయ్యాయంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకాగాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తన పిల్లలను సోషల్ మీడియాలో ప్రభుత్వం వేటాడుతోందంటూ ఆమె మంగళవారం కూడా ఆరోపణలు చేశారు.

ఎన్నికలకు ముందు ప్రత్యర్థులకు చెందిన ఇళ్లల్లో దర్యాప్తు అధికారుల సోదాలపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు ఆమె ఇలా స్పందించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ వదిలేయండి. వారు నా పిల్లల ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను సైతం హ్యాక్ చేస్తున్నారు. వారికి మరొక పని అంటూ లేదా?’’ అని ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీకి కుమార్తె మిరయా వాద్రా (18), కుమారుడు రైహాన్ వాద్రా (20) ఉన్నారు.

ప్రియాంకా పిల్లల ఇన్ స్టా గ్రామ్ ఖాతాల హ్యాకింగ్ ఆరోపణలపై విచారణకు కేంద్ర సర్కారు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అడ్వాన్స్ డ్ యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్ దర్యాప్తు చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణల నిజానిజాలను ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తేలుస్తుందని పేర్కొన్నాయి.

More Telugu News