Omicron: ఫిబ్రవరిలో పతాక స్థాయికి ఒమిక్రాన్: శాస్త్రవేత్తల హెచ్చరిక

Omicron likely to peak in Feb 2022 but subside in a month
  • అంచనా వేసిన ‘సూత్రమోడల్’ శాస్త్రవేత్తలు
  • అయినా భయం అక్కర్లేదు
  • నెల రోజులకు మించి తీవ్రత ఉండదని వివరణ
  • దక్షిణాఫ్రికా పరిస్థితులు దేశంలోనూ ప్రతిబింబిస్తాయన్న ఐఐటీ ప్రొఫెసర్లు
ప్రాణాంతక ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్న వేళ శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఇండియాలో కొత్త వేరియంట్ ఉద్ధృతి పతాకస్థాయికి చేరుకుంటుందని తెలిపారు. మహమ్మారిని ట్రాక్ చేసేందుకు ఉపయోగించే ‘సూత్ర మోడల్’ వెనక ఉన్న ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఐఐటీ కాన్పూరుకు చెందిన మణీంద్ర అగర్వాల్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఎం.విద్యాసాగర్ కలిసి ‘సూత్ర మోడల్’ను రూపొందించారు.

ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఫిబ్రవరిలో రోజు వారీ కొత్త కేసులు 1.5 నుంచి 1.8 లక్షల మధ్య ఉండొచ్చని వీరు అభిప్రాయపడ్డారు. సహజ రోగ నిరోధకశక్తి, లేదంటే టీకాల ద్వారా పొందిన ఇమ్యూనిటీ నుంచి ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకుంటే కనుక కేసులు ఈ స్థాయిలో ఉంటాయని వారు అంచనా వేశారు. అయితే, పతాక స్థాయికి చేరుకున్నాక దాని పతనం కూడా అంతే వేగంగా ఉంటుందని, నెల రోజులకు మించి దాని ఉద్ధృతి కొనసాగకపోవచ్చని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోనూ ఇదే జరిగిందని గుర్తు చేశారు.

దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వ్యాప్తి శరవేగంగా పెరిగి పతాక స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. అక్కడ మూడు వారాల్లోనే కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని, ఆపై కేసుల్లో క్షీణత మొదలైందని మణీంద్ర వివరించారు. డిసెంబరు 15న గరిష్ఠంగా సగటున 23,000 కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం అవి 20 వేలుగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మృతుల సంఖ్య ప్రస్తుతం రెండంకెల్లోనే ఉన్నా ఇంకా పెరుగుతున్నట్టు చెప్పారు.

జనాభా సారూప్యత, సహజ రోగనిరోధక శక్తి స్థాయిని బట్టి సౌతాఫ్రికాలో జరుగుతున్నదే భారత్‌లోనూ జరిగే అవకాశం ఉందని ఐఐటీ ప్రొఫెసర్లు అభిప్రాయపడ్డారు. అయితే, కీలకమైన విషయం ఏమిటంటే.. సహజ రోగనిరోధక శక్తి, లేదంటే టీకా ద్వారా పొందిన రోగ నిరోధక శక్తి నుంచి ఇది ఎంత వరకు తప్పించుకోగలదన్నది ఇప్పటికీ అంతుబట్టడం లేదని పేర్కొన్నారు.

యూకే, యూఎస్‌లో వెలుగు చూస్తున్న కేసులు, మరణాలు, ఆసుపత్రిలో చేరుతున్న వారి గురించి ప్రస్తుత అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే కనుక దేశంలో ఫిబ్రవరిలో కేసులు పతాక స్థాయికి చేరి, ఆపై ఒమిక్రాన్ భయం క్రమంగా తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
Omicron
India
South Africa
IIT Professors

More Telugu News