Jagan: సీఎం జగన్ హాజరు మినహాయింపు కోరడంపై సీబీఐ కోర్టు అసహనం!

  • సీబీఐ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ
  • ప్రతిసారి హాజరు మినహాయింపు కోరుతున్నారన్న కోర్టు
  • ఎందుకు హాజరు కావడంలేదని ప్రశ్నించిన వైనం
  • తెలంగాణ హైకోర్టు తీర్పు రావాల్సి ఉందన్న జగన్ న్యాయవాది
CBI Court asks why Jagan does not attend in person

అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా సీఎం జగన్ పై సీబీఐ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నేటి విచారణకు సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడం పట్ల తీవ్రంగా స్పందించింది. ప్రతిసారి మినహాయింపు కోరుతున్నారని అసంతృప్తి వెలిబుచ్చింది. విచారణకు ఎందుకు హాజరు కావడంలేదని సీబీఐ న్యాయస్థానం ప్రశ్నించింది.

అందుకు సీఎం జగన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ... హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టును కోరామని వివరణ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ హైకోర్టులో దీనిపై తీర్పు రానుందని వెల్లడించారు. అనంతరం సీబీఐ కోర్టు స్పందిస్తూ... దీనిపై వివరాలను మెమో రూపంలో సమర్పించాలని జగన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జగన్ న్యాయవాది వెంటనే మెమో దాఖలు చేశారు.

గతంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరగా, సీబీఐ కోర్టు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. దాంతో సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు దీనిపై వాదోపవాదాలు ముగించి తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

More Telugu News