Balakrishna: బసవతారకం ఆసుపత్రిలో సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన బాలకృష్ణ... ఫొటోలు ఇవిగో!

Balakrishna attends Semi Christmas celebrations at Basavatarakam Hospital in Hyderabad
  • దేవుడి ప్రతిరూపం క్రీస్తు అన్న బాలయ్య 
  • మనల్ని రక్షించడానికి జీసస్ త్యాగం చేశాడని వివరణ
  • ఒమిక్రాన్ నేపథ్యంలో జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని సూచన

మానవాళికి శాంతి ప్రబోధం చేసిన క్రీస్తు జన్మదినం క్రిస్మస్ పర్వదినానికి ముందు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయతీ. హైదరాబాదులోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలోనూ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బసవతారకం ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

దీనిపై ఫేస్ బుక్ లో స్పందిస్తూ... క్రీస్తు దేవుడి ప్రతిరూపం అని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాణుల పట్ల దయ, కరుణతో మెలగాలని ఉద్బోధించిన మహనీయుడు జన్మించిన సుదినం క్రిస్మస్ అని వివరించారు. సాటి మనిషిని, ప్రాణిని ప్రేమించలేనివాడు ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థం అని ఆయన చెప్పిన మాటను ఏ మతం కూడా కాదనలేదని తెలిపారు.

మనందరినీ రక్షించడానికి జీసస్ చేసిన త్యాగం, ఆయన మనందరి పట్ల చూపిన ప్రేమను మనం సమాజం పట్ల ప్రదర్శించాలని బాలయ్య పిలుపునిచ్చారు. బసవతారకం ఆసుపత్రి ముఖ్య ఉద్దేశం కూడా అదేనని, ఆపద ఎదుర్కొంటూ సహాయం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్క రోగినీ ప్రేమతో, ఆప్యాయతతో అక్కున చేర్చుకుంటుందని వివరించారు.

ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, కుటుంబ సభ్యులందరినీ ఒక్కచోటికి చేర్చే పండగ క్రిస్మస్ అని, అయితే ఈసారి ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతున్నందున మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాలను కూడా కాపాడుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News