helmet: హెల్మెట్ లేకుండా బైక్ తీస్తే కేసే.. మరోసారి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సీరియస్ వార్నింగ్

Helmet must for pillion riders warn Hyderabad Traffic Police
  • వెనుక కూర్చున్నవారికీ హెల్మెట్ తప్పనిసరి
  • ఈ ఏడాది ఇప్పటికే 11.54లక్షల కేసుల నమోదు
  • హెల్మెట్ లేకే ప్రమాదాల్లో మరణాలు
వాహనదారులు హెల్మెట్ నిబంధనను లైట్ గా తీసుకుంటుండడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఇప్పటి వరకు హెల్మెట్ ధారణ ప్రాధాన్యంపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని.. అయినా మారకపోతే వారిని దారికి తీసుకు వచ్చేందుకు కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనం నడిపేవారితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించేందుకు అనుమతి ఉండదన్నారు. ఈ ఏడాది ఇప్పటికి హెల్మెట్ లేని వాహనదారులపై 11,54,463 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ మధ్య ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టిన పోలీసులు 27,306 కేసులను నమోదు చేశారు.

‘‘వెనుక ప్రయాణిస్తున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడడం వాహనదారుడిపై ఉన్న బాధ్యత. వాహనం నడిపే వారితో పోలిస్తే వెనుక కూర్చున్న వారికి ప్రమాదాల్లో ఎక్కువ అపాయం ఉంటోంది’’ అని సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఎన్నో ప్రమాదాల్లో హెల్మెట్ ధరించిన వాహనదారుడు సురక్షితంగా బయటపడగా.. హెల్మెట్ లేక వెనుకనున్న వారు మరణించినట్టు పేర్కొన్నారు.

హెల్మెట్ లేకపోతే వాహనదారుడితోపాటు, వెనుక కూర్చున్న వారికి కూడా విడివిడిగా చలాన్లు విధించనున్నట్టు ట్రాఫిక్ విభాగం డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. వాహనంపై చిన్నపిల్లలను తీసుకెళుతుంటే వారికి సైతం హెల్మెట్ పెట్టాల్సిందిగా సూచించారు.
helmet
trafficpolice
warning
bikes
pivillionrider

More Telugu News