కేరళలో ఇద్దరు రాజకీయ నేతల దారుణ హత్య... అళప్పుజ జిల్లాలో ఉద్రిక్తత!
- శనివారం రాత్రి కేఎస్ షాన్ హత్య
- కారుతో ఢీకొట్టిన దుండగులు
- ఆదివారం ఉదయం రంజిత్ శ్రీనివాస్ హత్య
- ఇంట్లోకి చొరబడి కడతేర్చిన వైనం
- హత్యలను ఖండించిన సీఎం విజయన్
- అళప్పుజ జిల్లాలో 144 సెక్షన్
కేఎస్ షాన్ గతరాత్రి పార్టీ ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు ఆయన బైక్ ను ఢీకొట్టారు. కిందపడిపోయిన షాన్ పై తీవ్రంగా దాడి చేశారు. షాన్ కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక, ఈ ఉదయం రంజిత్ శ్రీనివాస్ ను దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి మరీ అంతమొందించారు. షాన్ హత్యకు ప్రతీకారంగానే కొన్ని గంటల వ్యవధిలోనే రంజిత్ హత్య జరిగినట్టు భావిస్తున్నారు.
ఈ హత్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ రెండు హత్యలతో అళప్పుజ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలో 144 సెక్షన్ విధించారు.