Kodali Nani: కొడాలి నాని, అంబటి రాంబాబు, వంశీలతో పార్టీకి తీరని నష్టం: ఒంగోలు వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

ycp leader sensational comments on own party leaders
  • బాలినేని జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సుబ్బారావు గుప్తా
  • వారు ముగ్గురు పార్టీ హితులో, శత్రువులో అర్ధం కావడం లేదు
  • వారి వల్ల 20 శాతం ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది
  • టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలతో వెంబడించి కొడతారు
  • ఈ వీడియోను ముఖ్యమంత్రి పేషీకి పంపిస్తా
ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు సొంతపార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. వారు అసలు వైసీపీకి హితులో, శత్రువులో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. వారి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని, ఈసారి టీడీపీ అధికారంలో వస్తే కర్రలతో వెంబడించి కొడతారని అన్నారు. ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి కీడు చేస్తోందని సుబ్బారావు అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. కొందరి తీరును చూస్తుంటే కోవర్టు ఆపరేషన్‌లా అనిపిస్తోందన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని విస్మరిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, వంశీ కారణంగా పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో ఇప్పటికైనా తెలుసుకోవాలని అన్నారు. అందరికీ ఇలాంటి అభిప్రాయమే ఉన్నా చెప్పడానికి భయపడుతున్నారని అన్నారు. తాను మాత్రం ఈ వీడియోను ముఖ్యమంత్రి పేషీకి పంపుతానని చెప్పారు. సీఎం జగన్‌ చొరవతీసుకోకుంటే పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని సుబ్బారావు గుప్తా వ్యాఖ్యానించారు.
Kodali Nani
Vallabhaneni Vamsi
Ambati Rambabu
YSRCP
YS Jagan
Andhra Pradesh

More Telugu News