Team India: ఈ ఐదేళ్లు విరాట్ కెప్టెన్సీలో ప్రతిక్షణం ఆస్వాదించా.. కోహ్లీ గురించి రోహిత్​ ఆసక్తికర కామెంట్లు.. ఇదిగో వీడియో

Rohit Says He Enjoyed Every Moment In Kohli Captaincy
  • ఇప్పటికీ ఎప్పటికీ ఆస్వాదిస్తానన్న వన్డే కెప్టెన్
  • ప్రతి మ్యాచ్ నూ గెలవాలన్న పట్టుదల కోహ్లీది
  • ప్రతి ఆటగాడికి వారి విలువేంటో తెలియజెప్పాలి
  • జట్టు సభ్యులందరితోనూ కమ్యూనికేషన్ ముఖ్యం
  • తనకు దొరికిన కొన్ని అవకాశాల్లో ఇదే చేశా
విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొత్త వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఐదేళ్లు జట్టును ముందుండి నడిపాడని కొనియాడాడు. అతడి కెప్టెన్సీలో ప్రతిక్షణం ఆస్వాదించానని స్పష్టం చేశాడు. బీసీసీఐ టీవీతో ఇంటరాక్షన్ సందర్భంగా రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ కెప్టెన్సీలో జట్టు చాలా గొప్పగా ఆడిందన్నాడు.

ప్రతి మ్యాచ్ ను గెలవాలన్న పట్టుదల, సంకల్పం కోహ్లీలో కనిపించేదని రోహిత్ వివరించాడు. జట్టు మొత్తానికీ అదే సందేశాన్ని ఇచ్చేవాడన్నాడు. తాను కోహ్లీ కెప్టెన్సీలో ఎన్నో మ్యాచ్ లు ఆడానని గుర్తు చేశాడు. ఇప్పటికీ..ఎప్పటికీ అతడి కెప్టెన్సీలో ఆడడాన్ని ఆస్వాదిస్తూనే ఉంటానన్నాడు. తుది ఫలితానికి ముందు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని రోహిత్ చెప్పుకొచ్చాడు. చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీ (చాంపియన్స్ ట్రోఫీ)ని నెగ్గామని చెప్పాడు.

ఆ తర్వాత ట్రోఫీలు రాకపోవడంలో జట్టు తప్పేమీ లేదన్నాడు. జట్టు, ఆటగాళ్ల ప్రదర్శన  ఎంతో బాగుందని తెలిపాడు. అయితే, ఐసీసీ ట్రోఫీని ఒడిసిపట్టలేకపోయామన్నాడు. ఈసారి అదే తమకు అతిపెద్ద సవాల్ అని రోహిత్ పేర్కొన్నాడు. అయితే, ఐసీసీ ట్రోఫీ నెగ్గాలంటే చేయాల్సినవి చాలా ఉన్నాయన్నాడు. ఎన్నో వరల్డ్ కప్ లు రాబోతున్నాయని, వాటిలో మెరుగ్గా రాణించాలన్నదే జట్టు తాపత్రయం అని తెలిపాడు.

క్లిష్ట సవాళ్ల నుంచి ఎలా బయటకు రావాలన్నది చాలా ముఖ్యమని చెప్పాడు. గతంలో అలాంటి సవాళ్లెన్నో ఎదురయ్యాయని గుర్తు చేశాడు. 10 కే మూడు వికెట్లు లేదా 15 కే 2 వికెట్లు కోల్పోయిన సందర్భాల్లో జట్టు కోలుకున్న దాఖలాలు లేవన్నాడు. కాబట్టి ఆదిలోనే వికెట్లు పడినా మిడిలార్డర్ బ్యాటర్లు పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రతి ఆటగాడికి జట్టులో తన విలువేంటో, తనను ఎందుకు తీసుకున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నాడు.

టీమిండియాను నడిపించేందుకు గతంలో తనకు తక్కువ అవకాశాలే వచ్చాయని, కానీ, అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రతి ఆటగాడితోనూ మాట్లాడేవాడినని, వారి ప్రాముఖ్యతను వివరించేవాడినని రోహిత్ గుర్తు చేశాడు. కోచ్, కెప్టెన్ లకు ప్లేయర్లతో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమన్నాడు. ఆడింది మూడు మ్యాచ్ లే అయినా రాహుల్ ద్రవిడ్ తో కలిసి ఆడడం ఎంతో అద్భుతంగా ఉందని రోహిత్ చెప్పాడు. ద్రవిడ్ ఎలాంటి ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అతడుంటే ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పాడు.
Team India
Virat Kohli
Rohit Sharma
Cricket

More Telugu News