Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Indonesia issues tsunami warning after huge earthquake near Flores Island
  • ఈ ఉదయం 7.7 తీవ్రతతో భారీ భూకంపం
  • ఫ్లోరస్ సముద్రంలో 18.5 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం
  • భూకంప ప్రాంతానికి 1000 కిలోమీటర్ల పరిధిలో భారీగా ఎగసిపడనున్న అలలు
  • 2004లో ఇండోనేషియాలో పెను విలయాన్ని సృష్టించిన సునామీ
ఇండోనేషియాలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఫ్లోరెస్ దీవిలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. అప్రమత్తమైన ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా జియోలాజికల్ సర్వే కూడా దీనిని నిర్ధారించింది. మామెర్ పట్టణానికి ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో ఫ్లోరస్ సముద్రంలో 18.5 కిలోమీటర్ల అడుగున భూకంపం సంభవించినట్టు తెలిపింది.

భూకంపం సంభవించిన ప్రాంతానికి చుట్టూ 1000 కిలోమీటర్ల పరిధిలో అలలు భయంకరంగా ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. తాజా భూకంపం కారణంగా ప్రాణ నష్టం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాంతంలో ఇటీవల సంభవించిన భూకంపాలు.. సునామీ, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రమాదాలకు కారణమయ్యాయి. ఫలితంగా భారీ నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.

ఇండోనేషియా పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ స్థానంపై ఉన్న కారణంగా ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తున్నాయి.  జపాన్ నుంచి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ మీదుగా విస్తరించి ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడంతో తీవ్రమైన భూకంపాలు సంభవిస్తున్నాయి.
 
2004లో ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదానికి కారణమైంది. అప్పట్లో సుమత్రా దీవులలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫలితంగా సంభవించిన సునామీ కారణంగా 2,20,000 మంది చనిపోయారు. ఒక్క ఇండోనేషియాలోనే 1,70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన విషాదం.

ఇక, 2018లో లోంబోక్ దీవిలో సంభవించిన తీవ్రమైన భూకంపం, ఆ వెంటనే సంభవించిన సునామీ కారణంగా 550 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సులావెసి ద్వీపంలోని పాలులో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 4,300 మంది చనిపోయారు.
Indonesia
Tsunami
Earthquake
US Geological Survey

More Telugu News