Elon Musk: టైమ్ మ్యాగజైన్ 'ఈ ఏటి మేటి వ్యక్తి'గా ఎలాన్ మస్క్

  • పర్సన్ ఆఫ్ ద ఇయర్ ను ప్రకటించిన టైమ్ మ్యాగజైన్
  • ఈ ఏడాది అత్యంత సంపన్నుడిగా అవతరించిన మస్క్
  • టెస్లా, స్పేస్ ఎక్స్ షేర్ల విలువ పెంపు
  • జెఫ్ బెజోస్ ను వెనక్కినెట్టిన టెస్లా సీఈఓ
TIME Magazine announce Elon Musk Person Of The Year

అటు విద్యుత్ వాహనాలు, ఇటు అంతరిక్ష యాత్రలు, పరిశోధనలతో దూసుకుపోతున్న టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కు విశిష్ట గుర్తింపు లభించింది. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ (పర్సన్ ఆఫ్ ద ఇయర్) ఈ ఏటి మేటి వ్యక్తిగా ఎలాన్ మస్క్ ను ఎంపిక చేసింది.

'పర్సన్ ఆఫ్ ద ఇయర్' పురస్కారానికి ప్రతీక అంటే ఎంతో ప్రభావశీలత కలిగిన వ్యక్తి అని చెప్పవచ్చని, మస్క్ కంటే ఎక్కువగా కొందరు మాత్రమే ఈ భూమండలంపై ఆ స్థాయిలో ప్రభావం చూపారని టైమ్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెంథాల్ పేర్కొన్నారు. 2021లో మస్క్ కేవలం అత్యంత సంపన్నుడిగా అవతరించడమే కాకుండా, గణనీయ స్థాయిలో సమాజ గతినే మార్చివేశారని, అందుకు నికార్సయిన ఉదాహరణ మస్క్ అని కొనియాడారు.

ఇక ఈ ఏడాది మస్క్ కు బాగా కలిసొచ్చిన ఏడాదిగా చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో టెస్లా, స్పేస్ ఎక్స్ షేరు విలువ అమాంతం పెరిగిపోవడంతో మస్క్ సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. అంతరిక్ష యాత్రల్లోనూ ముందంజ వేశారు. సుశిక్షితులైన వ్యోమగాములు ఎవరూ లేకుండా, కేవలం పర్యాటకులతోనే భూ కక్ష్యలోకి స్పేస్ క్రాఫ్టును పంపించి ఔరా అనిపించారు. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత ధనికుడు ఎలాన్ మస్కే. ఆయన నికర ఆస్తి విలువ 256 బిలియన్ డాలర్లు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ (196 బిలియన్ డాలర్లు)ను వెనక్కినెట్టిన మస్క్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు.

ఇక టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' పురస్కారానికి ఎంతో విలువ ఉంది. 1927 నుంచి టైమ్ మ్యాగజైన్ ఈ పురస్కారం ప్రకటిస్తోంది. టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటో వస్తే చాలు... అదే పెద్ద అవార్డుగా భావిస్తారు. వ్యక్తిగతంగా ఎదగడమే కాకుండా, సమాజంపై అధిక ప్రభావం చూపే వ్యక్తులను టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' గా గుర్తిస్తుంటుంది. గతేడాది ఈ విశిష్ట గౌరవం అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హారిస్ లకు దక్కింది.

విస్మయం కలిగించే విషయం ఏమిటంటే, 1938లో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా టైమ్ మ్యాగజైన్ ఈ ఏటి మేటి వ్యక్తిగా ఎంపికయ్యారు. కరుడుగట్టిన నియంతగా జర్మనీ సహా అనేక దేశాలపై హిట్లర్ చూపిన ప్రభావం తక్కువేమీ కాదు. టైమ్ మ్యాగజైన్ ఓ వ్యక్తిని ఎంపిక చేసిందంటే అది ఆ వ్యక్తి పట్ల గౌరవసూచకంగా భావించనక్కర్లేదని హిట్లర్ ఎంపిక నిరూపించింది. నెగెటివ్ గా అయినా హిట్లర్ ఎంతో ప్రభావం చూపించాడన్న ఉద్దేశంతో నాడు టైమ్ మ్యాగజైన్ ఆయనను పరిగణనలోకి తీసుకుంది.

ఆ లెక్కకొస్తే ఎలాన్ మస్క్ వివాద రహితుడేమీ కాదు. టెస్లా షేరు విలువ పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా ట్వీట్ చేశాడంటూ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజి 2018లో మస్క్ పై అభియోగాలు మోపింది. ఆయనకు సంబంధించిన టెస్లా కార్లలోనూ పలు లోపాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. టెస్లా విద్యుత్ కార్లలో భద్రతపై ఇప్పటికీ సందేహాలున్నాయి. టెస్లా కార్లలో ఏర్పాటు చేసిన ఆటోపైలెట్ సాఫ్ట్ వేర్ ను అమెరికా భద్రతా సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. పలు యాక్సిడెంట్లకు దారితీస్తోందని ఈ సాఫ్ట్ వేర్ పై ఆరోపణలు ఉండడమే అందుకు కారణం.

  • Loading...

More Telugu News