Ruthuraj Gaikwad: సూపర్ ఫామ్ లో ఉన్న ఈ ఆటగాడిని ఎందుకు తీసుకోవడంలేదు?: టీమిండియా సెలెక్టర్లను ప్రశ్నించిన వెంగ్ సర్కారు

Dilip Vengsarkar wants selectors must include Ruthuraj Gaikwad into national squad
  • దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్
  • విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సెంచరీలు
  • ఐపీఎల్లోనూ ఆరెంజ్ క్యాప్ సొంతం 
  • దక్షిణాఫ్రికా టూర్ కు గైక్వాడ్ ను తీసుకోవాలన్న వెంగ్ సర్కార్
వివిధ పర్యటనలు, టోర్నీలకు భారత క్రికెట్ జట్టును ఎంపిక చేసిన ప్రతిసారి కొన్ని విమర్శలు రావడం సహజం. తాజాగా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో మాజీ సారథి దిలీప్ వెంగ్ సర్కార్ సెలెక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మహారాష్ట్ర రంజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (24) అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని, అతడు ఇంకెన్ని పరుగులు చేస్తే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారని ప్రశ్నించాడు.

ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా మూడు సెంచరీలు నమోదు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకోవడానికి అవసరమైన పరుగులను గైక్వాడ్ సాధించాడని, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు అతడిని తప్పకుండా ఎంపిక చేయాలని వెంగీ సూచించాడు. సెలెక్టర్లు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా గైక్వాడ్ నేరుగా జాతీయ జట్టులోకి తీసుకుని, తగినన్ని అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేశాడు. గైక్వాడ్ వన్ డౌన్ లోనూ ఆడగలడని వెల్లడించాడు.

రుతురాజ్ 18, 19 ఏళ్ల టీనేజి కుర్రాడు అయ్యుంటే అతడికి ఇంకా భవిష్యత్ ఉందని భావించొచ్చని, కానీ ఇప్పుడతని వయసు 24 ఏళ్లని, ఇంకెప్పుడు జట్టులోకి ఎంపిక చేస్తారని ప్రశ్నించాడు. ఇప్పుడు తీసుకోక 28 ఏళ్ల వయసొస్తే అప్పుడు తీసుకుంటారా? అని వ్యంగ్యం ప్రదర్శించాడు.

రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడే ఈ మహారాష్ట్ర క్రికెటర్ 2021 సీజన్ లో ఐపీఎల్ లో 16 మ్యాచ్ ల్లో 635 పరుగులు చేయడం అతడి ఫామ్ కు అద్దం పడుతోంది. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా గైక్వాడ్ రికార్డు నమోదు చేశాడు. తాజాగా, విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ సెంచరీలతో మోత మోగించాడు. మధ్యప్రదేశ్ పై 136, చత్తీస్ గఢ్ పై 154 నాటౌట్, కేరళపై 124 పరుగులు చేశాడు.
Ruthuraj Gaikwad
Dilip Vengsarkar
Team India
Selectors

More Telugu News