అమెరికాలో టోర్నడో విలయతాండవం... 100 మంది బలి
- కెంటకీ సహా పలు ప్రాంతాల్లో టోర్నడో పంజా
- తీవ్ర స్థాయిలో ఆస్తినష్టం
- నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన ఫ్యాక్టరీ
- అంధకారంలో 3 లక్షల మంది
తాజాగా కెంటకీ రాష్ట్రంలో ఓ భారీ టోర్నడో తీవ్ర ప్రాణనష్టం కలిగించింది. దీని ధాటికి 100 మందికి పైగా బలయ్యారు. వీరందరూ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు అని తెలుస్తోంది. టోర్నడో వచ్చిన సమయంలో ఫ్యాక్టరీలో 110 మంది వరకు ఉన్నారు. ఈ టోర్నడో కారణంగా తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించింది. కెంటకీ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఇంతటి టోర్నడో రాలేదని గవర్నర్ ఆండీ బెషీర్ వెల్లడించారు.
ఇల్లినాయిస్, ఆర్కన్సాస్ ప్రాంతాల్లోనూ టోర్నడో ప్రభావం కనిపించింది. ఓ కొవ్వొత్తుల ఫ్యాక్టరీ, అమెజాన్ గోడౌన్, ఓ ఆసుపత్రి నామరూపాల్లేకుండా పోయాయి. టోర్నడో తీవ్రతకు విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో 3 లక్షల మంది అంధకారంలో మగ్గుతున్నారు.