Srinivasananda: వాడిన పూలతో తయారైన అగర్ బత్తీలను లను స్వామివారికి వినియోగించడం శాస్త్ర విరుద్ధం: టీటీడీపై మండిపడిన శ్రీనివాసానంద

Srinivasananda condemns TTD decision to make Agarbathis with used flowers
  • తిరుమల శ్రీవారి కైంకర్యాలకు నిత్యం టన్నుల కొద్దీ పుష్పాలు
  • వాడిన పూలతో అగర్ బత్తీలు చేయాలని టీటీడీ నిర్ణయం
  • టీటీడీ తీరు మార్చుకోవాలన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు
  • ఏ చర్చకైనా సిద్ధమని వెల్లడి

తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీ వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. స్వామి వారి కైంకర్యాల్లో వినియోగించే పూల దండలను చేతితో ముట్టుకోకుండా వాటిని భూమిలో కప్పేయాలని శాస్త్రాలు చెబుతున్నాయని, కానీ ఆ పూలతో అగర్ బత్తీలు చేసి అమ్ముతామని టీటీడీ ప్రణాళికలు రచిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్వామివారికి అలంకారం చేసినంతవరకు పూలు పవిత్రమైనవేనని, కానీ ఒక్కసారి వాడిన పూలను పవిత్ర జలాల్లో కలిపేయడం కానీ, వాటిని భూమిలో కప్పివేయడం కానీ చేయాలని శ్రీనివాసానంద వివరించారు. వాడిపోయిన పూలతో తయారుచేసిన అగర్ బత్తీలను మళ్లీ స్వామివారికే ఉపయోగిస్తారు కదా... ఇది సరైన విధానం కాదు అని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని శైవ, వైష్ణవ ఆగమ విధానాలు, పురాణాలు ఖండించాయని తెలిపారు.

ఇది కచ్చితంగా అపచారం కిందకే వస్తుందని, దీనిపై ఎక్కడైనా, ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమేనని శ్రీనివాసానంద అన్నారు. టీటీడీ శాస్త్రవిరుద్ధ చర్యలకు పాల్పడితే తాము నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. టీటీడీ ఒక ధార్మిక సంస్థ మాత్రమేనని, టీటీడీ బోర్డు ఏర్పాటైంది వ్యాపారం చేయడానికి కాదని స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News