32 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం.. రేపు ఉదయానికి ఏపీని తాకే అవకాశం
- విశాఖకు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
- ఇవాళ రాత్రి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
- రేపు ఉదయానికి 90 కిలోమీటర్ల వేగం
- అప్రమత్తంగా ఉండాలని సూచించిన విపత్తు నిర్వహణ కమిషనర్
ఇవాళ అర్ధరాత్రి నుంచి తీరం వెంట 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. రేపు ఉదయం 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాలువలు, ఇతర ప్రవాహాల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది కలిసి పనిచేయాలని విశాఖ కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. సహాయ చర్యల కోసం 66 మంది ఎన్డీఆర్ఎఫ్, 55 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించామన్నారు.