Prime Minister: కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలతో దేశం సంక్షోభం దిశగా పయనిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi Takes Jibe At Dynastic Politics
  • కుటుంబ పార్టీలతో ప్రజాస్వామ్యానికే ముప్పు
  • తరాలు మారుతున్నా ఒకే కుటుంబం చేతుల్లో పార్టీలు
  • కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అదే పరిస్థితి
  • రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని కామెంట్లు
  • డుమ్మా కొట్టిన కాంగ్రెస్ సహా 14 విపక్షాలు
కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలతో దేశం సంక్షోభం దిశగా పయనిస్తోందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలనుకునేవారికి అది ఓ పెద్ద ఆందోళనగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, బీజేపీ ఎంపీలు హాజరుకాగా కాంగ్రెస్ సహా 14 విపక్షాలు దూరంగా ఉన్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశమయ్యాయి.

అయితే, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలనుద్దేశించి ‘కుటుంబ పార్టీ’లపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘‘కుటుంబం కోసం పార్టీ.. కుటుంబం చేత పార్టీ.. ఇంకా ఏం చెప్పమంటారు? ఎన్నో తరాలుగా ఒకే కుటుంబం పార్టీని నడిపితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఓసారి కుటుంబ పార్టీలను చూడండి’’ అని అన్నారు.  తన ఉద్దేశం ఒక కుటుంబం నుంచి ఒకరికన్నా ఎక్కువ మంది రాజకీయాల్లోకి రాకూడదని కాదని, ప్రజల ఆదరణ ఉంటే రావొచ్చని అన్నారు. కానీ, తరాలు మారినా ఒక పార్టీని ఒకే కుటుంబానికి చెందిన వారు నడపడం వల్లే ముప్పని అంటున్నానని అన్నారు.


పార్టీలు తమ సొంత ప్రజాస్వామ్య స్ఫూర్తినే పోగొట్టుకుంటే.. దేశ ప్రజాస్వామ్యాన్ని మాత్రం ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించట్లేదని, ఓ వ్యవస్థ నిర్వహిస్తున్న వేడుక అని చెప్పారు. కొన్ని సార్లు దేశ ప్రయోజనాలనూ పక్కన పెట్టేస్తున్నారని అన్నారు. దేశ విభజన గాయం మానకపోయినా అంతిమంగా కావాల్సింది దేశ ప్రయోజనాలేనన్నారు.

స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ప్రజలకు తమ బాధ్యతలను మహాత్మాగాంధీ గుర్తు చేశారని చెప్పారు. అయితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని, బాధ్యతలు కాకుండా కేవలం హక్కులపైనే మాట్లాడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ముంబై 26/11 ఉగ్రదాడులనూ ఆయన గుర్తు చేశారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవంతో పాటు ఉగ్రదాడి జరిగిన దుర్దినం కూడా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో మన జవాన్లు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు.  

Prime Minister
Narendra Modi
BJP
Congress
Dynastic Politics

More Telugu News