Amaravati: హైకోర్టు లేకుండా కర్నూలులో న్యాయ రాజధాని ఎలా సాధ్యం?: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

How is judicial capital possible in Kurnool without the High Court Questioned High Court CJ
  • కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనంత వరకు అమరావతి నుంచి హైకోర్టు ఎక్కడికీ వెళ్లదన్న సీజే
  • ప్రభుత్వ నిర్ణయం కర్నూలు, ఇతర ప్రాంతాల మధ్య చిచ్చు రాజేసేలా ఉంది
  • ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమరావతి అభివృద్ధిని నాశనం చేసిందన్న న్యాయవాదులు
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నమోదైన వ్యాజ్యాలను విచారిస్తున్న హైకోర్టు.. న్యాయ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టే లేకుండా కర్నూలులో న్యాయ రాజధాని ఎలా సాధ్యమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు. కర్నూలులోనే హైకోర్టు ఉండాలని పాలన వికేంద్రీకరణ చట్టంలో స్పష్టంగా లేదన్నారు.

ఇప్పటికే లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలను అక్కడ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు ప్రధాన బెంచ్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చారని, కేంద్రం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయనంత వరకు అమరావతి నుంచి హైకోర్టు ఎక్కడికీ వెళ్లబోదని జస్టిస్ ప్రశాంత్‌కుమార్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిర్ణయం కర్నూలు, ఇతర ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని, విభేదాలకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో ఒకసారి తీసుకున్న నిర్ణయం హైకోర్టు ఏర్పాటు విషయంలోనూ వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. కాగా, పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్, రైతుల తరపు న్యాయవాది పీబీ సురేశ్ తమ వాదనలు వినిపిస్తూ.. శాసన, కార్యనిర్వహణ, న్యాయ విభాగాలన్నీ ఒక చోట ఉంటేనే దానిని రాజధాని అంటారని, అమరావతి విషయంలో ఓసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చడానికి వీల్లేదని అన్నారు.

రాజధాని అమరావతి నుంచి హైకోర్టును తరలించడానికి వీల్లేదన్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి నోటిఫికేషన్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతిలో ‘న్యాయ నగరం’ ఇప్పటికే ఏర్పాటు అయిందన్నారు. అలాగే, సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేయాలని శ్యాం దివాన్ కోర్టును కోరారు. రాజధాని ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రతిష్ఠ మాత్రమే కాకుండా జాతీయ ప్రతిష్ఠ కూడా ముడిపడి ఉందన్నారు. దీనిని అమలు చేయకపోతే అమరావతి ఆత్మను చంపినట్టు అవుతుందన్నారు.

మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చి అమరావతిలో అభివృద్ధి మొత్తాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. ఏపీ విభజన చట్టంలో ‘ది క్యాపిటల్’ అని స్పష్టంగా ఉందని, దీనర్థం ‘ఒక రాజధాని’ అని భావించాలని అన్నారు. ప్రభుత్వాలు మారొచ్చు కానీ, ప్రభుత్వ నిర్ణయాలు మారకూడదని, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కొనసాగించాల్సిందేనని అన్నారు.

అమరావతి మాస్టర్ ప్లాన్ విషయంలో ముందుకెళ్లాల్సిందేనని అన్నారు. సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాల వల్ల అమరావతికి లెక్కలేనంత నష్టం వాటిల్లిందని న్యాయవాది శ్యాం దివాన్ అన్నారు. దక్షిణ కొరియాలో రాజధాని తరలింపు నిర్ణయాన్ని తప్పుబడుతూ అక్కడి న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా న్యాయవాది రమేశ్ హైకోర్టుకు సమర్పించారు.
Amaravati
AP High Court
Farmers
AP Capital

More Telugu News