Amaravati: అమరావతి కేసులపై విచారణ మొదలు.. నేటి నుంచి రోజువారీ విచారణ జరపనున్న హైకోర్టు!

  • రోజువారీ విచారణ జరపనున్న సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం
  • గతంలో జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీతో ఆగిపోయిన విచారణ
  • 90కి పైగా పిటిషన్లు వేసిన రైతులు, నేతలు
AP High Court starts hearing on Amaravati cases from today

అమరావతి కేసులను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించనుంది. సీఆర్డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ, రాజధాని తరలింపులపై అమరావతి రైతులు, ఇతర నేతలు 90కి పైగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఈ వ్యాజ్యాలపై నేటి నుంచి రోజువారీ విచారణ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ కేసులను హైబ్రిడ్ పద్ధతుల్లో హైకోర్టు విచారించనుంది.

గత ఏడాది జనవరిలో ఈ పిటిషన్ల విచారణ కోసం జస్టిస్ మహేశ్వరి ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆ బెంచ్ ముందు రైతుల తరపు న్యాయవాదులు వాదనలను వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. అయితే జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ కావడంతో విచారణ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

ఈ క్రమంలో సీజేగా అరూప్ గోస్వామి రావడంతో ఈ కేసులు ఆయన ముందుకు వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టు 13న ఈ పిటిషన్లను ధర్మాసనం విచారించింది. ఆ సందర్భంగా తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేశారు. దీంతో అమరావతి పిటిషన్లపై రోజువారీ విచారణ జరగనుంది.

రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. రైతుల తరపు వాదనలు ముగిసిన తర్వాత, ప్రభుత్వం తన వాదనలను వినిపించనుంది. మరోవైపు అమరావతి రైతుల దీక్ష 697వ రోజుకు చేరుకుంది. 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో వారు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది.

More Telugu News