Bandla Ganesh: పూరి జగన్నాథ్ చేతుల మీదుగా 'డేగల బాబ్జీ' ట్రైలర్ విడుదల

Puri Jagannadh releases Bandla Ganesh movie Degala Babji trailer
  • 'ఒత్తు సెరుప్పు సైజ్ 7' చిత్రానికి రీమేక్ గా 'డేగల బాబ్జీ'
  • ఇప్పటికే ఆకట్టుకున్న సినిమా టైటిల్ పోస్టర్
  • అభిమానుల అండ కావాలన్న బండ్ల గణేశ్
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'డేగల బాబ్జీ' ట్రైలర్ ను ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రిషి ఫిలింస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో పార్తీబన్ హీరోగా వచ్చిన హిట్ చిత్రం 'ఒత్తు సెరుప్పు సైజ్ 7' చిత్రానికి తెలుగు వర్షన్ ఈ సినిమా.

ఇటీవల విడుదలైన 'డేగల బాబ్జీ' టైటిల్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'మీ అభిమానం కావాలి. మీ అండ కావాలి. మీరే నాకు కొండంత బలం. వస్తున్నా' అని ట్వీట్ చేశారు.

ట్రైలర్ చూస్తే... మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గ‌ణేశ్ ను పరిచయం చేశారు. సినిమాలో ఆయన పేరు డేగల బాబ్జీ. ట్రైలర్ అంతా ఆయన ఒక్కరే ఉన్నారు. 'యాభై దెయ్యాలు సార్... అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి', 'కోపం... కోపం... భరించలేనంత కోపం', 'పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టిన అప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను', 'పొట్టిగా ఉన్నా... మా అమ్మ అందంగా ఉంటుంది. అసలు మా అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా?'... డైలాగులు చెప్పేటప్పుడు నటుడిగా బండ్ల గణేష్ వేరియేషన్ చూపించారు.

'డేగల బాబ్జీ' టైటిల్ పోస్ట‌ర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్‌ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంటిపై కత్తిగాటుకు వేసిన కుట్లు, గాయం నుండి కారుతున్న రక్తపు బొట్టుతో గణేష్ గెటప్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ "తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి. అయితే, వాళ్ల వాయిస్ వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. హీరోగా డేగల బాబ్జీ పాత్రలో బండ్ల గణేష్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైల‌ర్‌కూ మంచి స్పందన లభిస్తోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం" అని అన్నారు.  సినిమా ట్రైలర్ మీరు కూడా చూడండి.
Bandla Ganesh
Degala Babji Movie
Movie Trailer
Tollywood
Puri Jagannadh

More Telugu News