Virat Kohli: గడ్డు రోజులు ఎంతో కాలం ఉండవు.. కోహ్లీకి సెహ్వాగ్, బీసీసీఐ బర్త్ డే విషెస్.. ఎమోషనల్ అయిన సిరాజ్
- ఇవాళ 33వ పడిలోకి అడుగుపెట్టిన కోహ్లీ
- రికార్డులను గుర్తు చేస్తూ బీసీసీఐ విషెస్
- తనకు పెద్దన్న అంటూ సిరాజ్ శుభాకాంక్షలు
- స్పెషల్ వీడియోలు పోస్ట్ చేసిన బీసీసీఐ, ఆర్సీబీ
టీమిండియా కెప్టెన్ కింగ్ విరాట్ కోహ్లీ ఇవాళ (నవంబర్ 5) 33వ పడిలోకి అడుగుపెట్టాడు. శ్రీలంకపై దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్ తో 19 ఏళ్ల ప్రాయంలో సీనియర్ల జట్టులోకి అడుగుపెట్టిన కోహ్లీ.. అప్పటి నుంచి బ్యాట్ తో ఎన్నెన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలనందించి.. చేజింగ్ రారాజుగా పేరు తెచ్చుకున్న కోహ్లీకి సహచరులు, మాజీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అతడి రికార్డుల వేటను ప్రస్తావిస్తూ బీసీసీఐ విషెస్ చెప్పింది. ‘‘23,159 అంతర్జాతీయ పరుగులు.. ఇంకా పటిష్ఠంగా ఆ పరుగుల వేట కొనసాగుతూనే ఉంది. కెప్టెన్ గా ఎక్కువ టెస్ట్ మ్యాచ్ విజయాలు.. 2011 వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ విన్నర్ టీంలో సభ్యుడు.. టీమిండియా కెప్టెన్, ఆధునిక తరం బ్యాటర్లలో గొప్పవాడైన విరాట్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అని చెబుతూ బంగ్లాదేశ్ తో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో అతడు సాధించిన శతకం వీడియోను పోస్ట్ చేసింది.
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. కోహ్లీకి స్ఫూర్తి నింపేలా విషెస్ చెప్పాడు. ‘‘గడ్డు రోజులు ఎంతో కాలం ఉండవు. గట్టి మనుషులు ఎల్లకాలం ఉంటారు. తరానికొక్క ఆటగాడైన విరాట్ కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం చాలా బాగుండాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ట్వీట్ చేశాడు.
‘‘హ్యాపీ బర్త్ డే విరాట్ కోహ్లీ. రాబోయే అన్ని రోజులూ నీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటున్నా’’ అని అజింక్య రహానే ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ టీం ఆర్సీబీ ఎమోషనల్ విషెస్ చెప్పింది. ఆర్సీబీకి, నీ జట్టు సభ్యులకు, ప్రపంచంలోని అభిమానులందరికీ అన్నీ అయినందుకు థ్యాంక్యూ అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ఆర్సీబీతో విరాట్ కోహ్లీ మూమెంట్స్ ను వీడియో రూపంలో పంచుకుంది.
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. ‘‘నీ లాంటి పెద్దన్న దొరకినందుకు నాకన్నా పెద్ద అదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు. నా జీవితంలోకి వచ్చినందుకు, కష్టనష్టాల్లో నా పక్కన నిలబడినందుకు కృతజ్ఞతలు. నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్ డే కింగ్’’ అంటూ పోస్ట్ పెట్టాడు. నవదీప్ సైనీ, వసీం జాఫర్ వంటి వారూ కోహ్లీకి విషెస్ చెప్పారు.