Andhra Pradesh: జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఏపీ కేబినెట్ భేటీ.. సినిమా టికెట్ల‌తో పాటు కీల‌క అంశాల‌పై చ‌ర్చ

ap cabinet meet
  • దాదాపు 20 నుంచి 25 అంశాలపై  చర్చ
  • సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై కూడా
  • దేవాదాయశాఖ చట్టాన్ని సవరించేందుకు సిద్ధం
  • ఏపీలోని దేవాల‌యాల్లో భద్రతపై  చ‌ర్చ‌లు
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభ‌మైంది. ఏపీ సచివాలయంలో జ‌రుగుతోన్న ఈ స‌మావేశంలో దాదాపు 20 నుంచి 25 అంశాలపై  చర్చించనున్నారు. ఏపీలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించడంపై కూడా ఇందులో చ‌ర్చిస్తున్నారు. అలాగే, సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై మంత్రులు త‌మ అభిప్రాయాలు చెబుతున్నారు.

మ‌రోవైపు,  దేవాదాయశాఖ చట్టాన్ని సవరించేందుకు ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేయ‌డంతో దానికి కేబినెట్   ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. టీటీడీలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై హైకోర్టు స్టే ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో  చట్ట సవరణకు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఏపీలోని దేవాల‌యాల్లో భద్రతకు సీసీ కెమెరాలతో పాటు తీసుకోవాల్సిన‌ ఇతర చర్యలపై కూడా కేబినెట్ లో చ‌ర్చిస్తారు. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరిలోని వారి సంక్షేమంపై, కడప జిల్లాలో ఏపీ హై గ్రేడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు కోసం భూముల సేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపులపై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవ‌కాశం ఉంది.  

కర్నూలులోని ప్రముఖ సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ కాలేజీకి రూరల్‌ మండలం దిన్నెదేవరపాడులో 50 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. అలాగే, పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్న అసైన్డ్‌ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు వెసులుబాటు ఇచ్చే విషయాన్ని ప‌రిశీలించే అవ‌కాశం ఉంది. విశాఖలోని శ్రీ శారదాపీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయించే అంశంపై చ‌ర్చించ‌నున్నారు.
Andhra Pradesh
AP Cabinet
Jagan

More Telugu News