Supreme Court: అల్లుడి ఇంట్లో అత్త చట్టబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Dependent Mother In Law Legal Representative Of Son In Law Says Supreme Court
  • 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి
  • పరిహారం చెల్లింపులో అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా చూడలేమన్న కేరళ హైకోర్టు
  • అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త కూడా చట్టబద్ధమైన ప్రతినిధి కిందికే వస్తుందన్న సుప్రీం ధర్మాసనం
  • అల్లుడి ఇంట్లో అత్త నివసించడం మన సమాజంలో అసాధారణం ఏమీ కాదన్న కోర్టు
  • రూ. 85,81,815ను 7.5 శాతం వడ్డీతో చెల్లించాలని బీమా కంపెనీకి ఆదేశం
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి బీమా చెల్లించే కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందేందుకు ఆమె కూడా అర్హురాలే అవుతుందని తేల్చి చెప్పింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ వ్యక్తి 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన కుటుంబానికి రూ. 74,50,971 పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆ పరిహారాన్ని రూ. 48,39,728కి తగ్గించింది. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

దీంతో బాధితుడి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 83,831 వేతనం తీసుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అతడు 52 ఏళ్లకే మరణించడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, కాబట్టి కుటుకబ సభ్యులకు రూ. 85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

ఇక అల్లుడిపై ఆధారపడి, అతని ఇంట్లోనే ఉంటున్న అత్త కూడా పరిహారం పొందేందుకు అర్హురాలేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అల్లుడు, కుమార్తె వద్ద అత్త నివసించడం భారత సమాజంలో అసాధారణ విషయమేమీ కాదని, వృద్ధాప్యంలో పోషణ కోసం అల్లుడిపైనా ఆధారపడుతుంటారని పేర్కొంది.

అతడు మరణించినప్పుడు ఆమె తప్పకుండా ఇబ్బందులు పడుతుందని తెలిపింది. కాబట్టి పరిహారం పొందేందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 166 ప్రకారం అల్లుడికి ఆమె చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని స్పష్టం చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తీర్పు వెలువరించిన తేదీ నుంచి పరిహారం చెల్లించే తేదీ వరకు పైన పేర్కొన్న మొత్తానికి 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది.
Supreme Court
Mother-In-Law
Son-In-Law
Insurance

More Telugu News