Andhra Pradesh: మరోసారి పట్టాభి అరెస్ట్ అంటూ ప్రచారం.. కొట్టిపారేసిన పోలీసులు

Police Arrest TDP Leader Pattabhi
  • నిన్ననే రాజమండ్రి జైలు నుంచి విడుదల
  • పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పట్టాభి వాహనాలకే అనుమతి
  • విజయనగరం కేసులో అరెస్ట్ చేశారంటూ ప్రచారం
  • ఆయనంతట ఆయనే వెళ్లిపోయారన్న పోలీసులు
  • తాము అరెస్ట్ చేయలేదని స్పష్టీకరణ
ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిన్న సాయంత్రం టీడీపీ నేత పట్టాభి రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఆయన విజయవాడ వెళ్లే క్రమంలో పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. నిన్ననగా విడుదలైన పట్టాభి ఇంతవరకూ ఇంటికి రాకపోవడంతో.. పోలీసులే అరెస్ట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనున్న వాహనంతో పాటు మరో రెండు వాహనాల్లో నిన్న సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి జైలు నుంచి పట్టాభి విజయవాడకు బయల్దేరారు.

అయితే పొట్టిపాడు టోల్ గేట్ వద్దకు చేరుకోగానే పోలీసులను భారీగా మోహరించారు. పట్టాభి కారుతో పాటు మరో రెండు వాహనాలనే అనుమతించారు. మిగతా వాహనాలను అక్కడే ఆపేశారు. దీంతో పట్టాభిని మరోసారి అరెస్ట్ చేస్తున్నారన్న ప్రచారం దావానలంలా వ్యాపించింది. విజయనగరం జిల్లాలో నమోదైన కేసులో పట్టాభిని ఇంకోసారి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది.

తనను పోలీసులు మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంతకుముందే టీడీపీ నేతల వద్ద పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. తాము పట్టాభిని అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. ఆయన తనంతట తానే వెళ్లిపోయారని, తమకేం సంబంధం లేదని చెప్పారు. పట్టాభి సురక్షిత ప్రాంతంలోనే ఉన్నారని టీడీపీ నేతలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది.

ఏపీ సీఎం జగన్ పై చేసిన తిట్ల కామెంట్లతో పట్టాభిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పట్టాభి ఇంటిపై, టీడీపీ ఆఫీసులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి జైలులో ఉన్న ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీంతో ఆయనకు హైకోర్టు నిన్న బెయిల్ ను మంజూరు చేసింది.
Andhra Pradesh
Telugudesam
Pattabhi
Police
AP Police

More Telugu News