Scotland: టీ20 ప్రపంచకప్: ఒమన్‌పై విజయంతో సూపర్-12లోకి స్కాట్లాండ్
- ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించిన స్కాట్లాండ్
- మూడు వికెట్లు తీసి ఒమన్‌ను దెబ్బకొట్టిన జోషీ డేవీ
- 122 పరుగులకే కుప్పకూలిన ఒమన్
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ సూపర్-12లోకి దూసుకెళ్లింది. గ్రూప్-బిలో భాగంగా గత రాత్రి ఒమన్‌లో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గిన స్కాట్లాండ్ 6 పాయింట్లతో సూపర్-12లో చోటు సంపాదించుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్‌ను 122 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 123 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. జార్జ్ మున్సీ 20, కెప్టెన్ కైల్ కోయెట్జెర్ 41, మాథ్యూ క్రాస్ 26, రిచీ బెర్రింగ్టన్ 31 పరుగులు చేశారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఒమన్‌ను ప్రత్యర్థి బౌలర్ డేవీ దారుణంగా దెబ్బతీశాడు. మూడు వికెట్లు పడగొట్టి బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో కుదురుకోనివ్వకుండా చేశాడు. అతడికి సహచర బౌలర్ల నుంచి మద్దతు లభించడంతో స్కాట్లాండ్ బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. సఫ్యాన్ షరీఫ్, లీస్క్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఒమన్ బ్యాటర్లలో అకీబ్ 37, మొహమ్మద్ నదీమ్ 25, కెప్టెన్ జీషన్ మక్సూద్ 34 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ రెండంకెల మార్కును కూడా చేరుకోలేకపోయారు. మూడు వికెట్లు తీసి ఒమన్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసిన జోష్ డేవీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.