Gurmeet Ram Rahim Singh: డేరా బాబాకు జీవిత ఖైదు విధించిన సీబీఐ కోర్టు

CBI Special Court imposes life imprisonment for Gurmeet Ram Rahim Singh
  • 2002లో అనుచరుడి హత్య
  • డేరా బాబా, మరో నలుగురిపై సీబీఐ అభియోగాలు
  • దోషులుగా నిర్ధారణ.. నేడు శిక్ష ఖరారు 
  • ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో శిక్ష అనుభవిస్తున్న బాబా
వివాదాస్పద మతగురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే, రూ.31 లక్షల జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది. రంజిత్ సింగ్ హత్య కేసులో ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుశీల్ గార్గ్ తుది తీర్పు వెలువరించారు. ఈ కేసులో మరో నలుగురికి కూడా జీవిత ఖైదు విధించారు. ఈ నలుగురు రూ.50 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించారు.

లైంగిక వేధింపుల కేసులో డేరా బాబా ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం హర్యానాలోని రోహతక్ జైలులో ఖైదీగా ఉన్నారు. డేరా బాబాను జైలు నుంచి వీడియో లింక్ ద్వారా విచారణకు హాజరు పర్చగా, మిగిలిన నలుగురిని కోర్టులో ప్రత్యక్ష విచారణకు తీసుకువచ్చారు. వారికి గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

డేరా బాబా అనుచరుడు రంజిత్ సింగ్ 2002న హత్యకు గురయ్యాడు. సాధ్విపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడానికి రంజిత్ సింగే కారణమని డేరా బాబా అనుమానించి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు విచారణలో తేలింది. ప్రత్యక్ష సాక్షులు కూడా డేరా బాబా ప్రమేయాన్ని నిర్ధారించారు. ఈ క్రమంలో విచారణ పూర్తి చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు అంతిమ తీర్పు వెలువరించింది.
Gurmeet Ram Rahim Singh
Life Imprisonment
Ranjit Singh Murder
CBI
India

More Telugu News