‘రాజద్రోహం’ కేసులపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- రాజులే లేనప్పుడు రాజద్రోహం అభియోగాలేంటి?
- పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి
- పన్నులకు వ్యతిరేకంగా ప్రజలు మూకుమ్మడిగా ఉద్యమిస్తే పాలకులు తోకముడుస్తారు
- చీరాల, పేరాల ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాలి
ఆర్థిక వనరులను సృష్టించడం ప్రభుత్వాల బాధ్యత అని, దానిని మానేసి ప్రజలపై పన్నుల భారం మోపడం తగదని అన్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోలు లీటరు రూ. 65, డీజిల్ రూ. 45కే లభిస్తుందని అన్నారు. ఇటీవల ఎడాపెడా నమోదవుతున్న రాజద్రోహం కేసులో లక్ష్మీనారాయణ స్పందిస్తూ .. రాజులే లేనప్పుడు రాజద్రోహ అభియోగాలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. మితిమీరిన పన్నులకు వ్యతిరేకంగా ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే పాలకులు తోకముడవక తప్పదన్నారు. బ్రిటిషర్ల హయాంలో జరిగిన చీరాల, పేరాల ఉద్యమమే ఇందుకు ఉదాహరణ అని గుర్తు చేశారు. రైతులు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటించాలని సూచించారు. అనంతరం రక్తదానం చేసిన ఆయన కరోనా నాటుముందు తయారీదారు ఆనందయ్యను సత్కరించారు.