teacher: తరగతి గదిలో విద్యార్థిని చితగ్గొట్టిన టీచర్.. వీడియో వైరల్
- తమిళనాడులో ఘటన
- మండిపడ్డ కార్తీ చిదంబరం
- టీచర్‌పై చర్యలకు డిమాండ్
ఓ విద్యార్థిని తరగతి గదిలోనే ఉపాధ్యాయడు చితగ్గొట్టిన ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ విద్యార్థి స్మార్ట్‌ఫోనులో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, అది వైరల్ అవుతోంది. తమిళనాడులో నిదురై కలియమూర్తి నగర్ ప్రాంతంలో ఉన్న నందనార్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
విద్యార్థి జుట్టు పట్టుకుని, కర్రతో ఉపాధ్యాయుడు కొట్టాడు. అలాగే, కింద పడేసి తన్నాడు. ఈ వీడియోను కాంగ్రెస్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. విద్యార్థులను ఇంతలా కొట్టే అధికారం ఏ ఉపాధ్యాయుడికీ లేదని ఆయన అన్నారు.
ఆ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కొట్టిన టీచర్ పేరు సుబ్రహ్మణ్యం అని తెలిసింది. ఏడుగురు విద్యార్థులు పాఠశాలకు సరిగ్గా హాజరు కావడం లేదని వారందరినీ టీచర్ కొట్టాడు. వారిలో ఒక విద్యార్థిని కొడుతుండగా మరో విద్యార్థి ఈ వీడియో తీశాడు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.