Stalin: బాణసంచా విక్రయాలపై మూకుమ్మడి నిషేధం సరికాదు: నాలుగు రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ

Stalin writes letter to 4 CMs requesting not to ban crackers
  • బాణసంచాపై నిషేధం విధించిన నాలుగు రాష్ట్రాలు
  • ఈ పరిశ్రమపై ఆధారపడి 8 లక్షల మంది బతుకుతున్నారన్న స్టాలిన్
  • నిషేధంపై పునరాలోచించాలని విన్నపం

టపాసుల తయారీపై ఆధారపడి దాదాపు 8 లక్షల మంది బతుకుతున్నారని... వారి పొట్ట కొట్టే పని చేయవద్దని కోరుతూ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. బాణసంచా విక్రయాలపై మూకుమ్మడి నిషేధం విధిస్తే... వీరంతా ఉపాధిని కోల్పోయి, రోడ్డున పడతారని ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఒడిశా సీఎంలకు రాసిన లేఖలో ఆయన తెలిపారు. కరోనా కారణంగా ఎన్నో మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని... అది తమిళనాడు ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపించిందని చెప్పారు.

తమిళనాడులోని శివకాశిలో ఉన్న బాణసంచా పరిశ్రమ రాష్ట్రంలోని ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకటని స్టాలిన్ తెలిపారు. ఈ పరిశ్రమపై ఆధారపడి 8 లక్షల మంది బతుకుతున్నారని... ఇంతమంది ఆధారపడి బతుకుతున్న అతిపెద్ద పరిశ్రమ ఇదేనని చెప్పారు. వాయుకాలుష్యం నేపథ్యంలో మీరు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే విషయం తనకు తెలుసని... కొన్ని ప్రత్యేకమైన బాణసంచాలపైనే సుప్రీంకోర్టు నిషేధం విధించిందని తెలిపారు.

ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్ తయారు చేస్తున్నారని... వీటివల్ల తక్కువ కాలుష్యం మాత్రమే వస్తుందని చెప్పారు. టపాసులపై నిషేధం సరికాదని... వీటిపై ఇతర దేశాల్లో కూడా నిషేధం లేదని తెలిపారు. లక్షలాది మంది ప్రజల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని నిషేధంపై పునరాలోచన చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News