Bathukamma: సద్దుల బతుకమ్మ ఎప్పుడు? కొన్ని చోట్ల నేడు, మరికొన్ని చోట్ల రేపు!

There is a confusion in saddula bathukamma festival
  • తెలంగాణ విద్వత్సభ, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో గందరగోళం
  • స్థానిక సంప్రదాయం ప్రకారం నిర్వహించుకోవచ్చన్న తెలంగాణ విద్వత్సభ
  • హైదరాబాద్‌లో నేడే బతుకమ్మ ముగింపు ఉత్సవాలు
తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ ఎప్పుడు అన్నదానిపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. కొన్ని ప్రాంతాలు నేడే బతుకమ్మ ముగింపు ఉత్సవాలకు సిద్ధమవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో రేపు (గురువారం) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడమే ఈ గందరగోళానికి కారణం.

ఈ సందిగ్ధతపై తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖర సిద్ధాంతి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను కొండపాక, వేములవాడల్లో ఏడు రోజులు నిర్వహిస్తారని, కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11, 13 రోజులు ఆడతారని పేర్కొన్నారు. దుర్గాష్టమినాడే సద్దుల బతుకమ్మగా విద్వత్సభ నిర్ణయించినట్టు చెప్పారు. అయితే, స్థానిక సంప్రదాయం ప్రకారం పండుగను జరుపుకోవచ్చని పేర్కొన్నారు.

తెలంగాణ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ పరిషత్ నేతలు గంగు ఉపేంద్రశర్మ, కృష్ణమాచార్య సిద్ధాంతి, ఇతర పండితులు మాత్రం 9 రోజుల ఆనవాయితీని దృష్టిలో పెట్టుకుని రేపు (గురువారం) సద్దుల బతుకమ్మను, 15న దసరా జరుపుకోవాలని సూచించారు. కాగా, హైదరాబాద్‌లో మాత్రం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నేడే బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి.
Bathukamma
Dasara
Saddula Bathukamma
Telangana

More Telugu News