Vinay: వినయ్, కీర్తన... ఇద్దరు ప్రేమికుల 'చోర'కథ!

Bengaluru police arrests thieves Vinay and Keerthan
  • బెంగళూరులో కొన్నాళ్లుగా వరుస చోరీలు
  • ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి దొంగతనాలు
  • ఇంటి యజమానులను ఏమార్చి చేతివాటం
  • సీసీ కెమెరా ఫుటేజి ద్వారా దొరికిపోయిన వైనం
టు-లెట్ బోర్డులు కనిపిస్తే చాలు... ఆ జంటకు పండగే పండగ! ఎందుకంటే వాళ్లిద్దరూ కొత్త జంటలా వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడుగుతారు... ఇంటి యజమానిని ఏమార్చి ఇంట్లోని విలువైన వస్తువులతో ఉడాయిస్తారు. ఇటీవల కాలంలో బెంగళూరులో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండడంతో పోలీసులు గట్టి నిఘా వేశారు. పక్కా సమాచారంతో వలపన్ని ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారే వినయ్, కీర్తన!

ఈ నెల మొదటివారంలో కూడా ఎప్పట్లాగానే టు-లెట్ బోర్డు చూసి ఓ ఇంటిపై కన్నేశారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నామని ఇంటి యజమానిని నమ్మించారు. ఆపై తమ పనితనం చూపించి రూ.15 వేలు డబ్బు, ల్యాప్ టాప్ తో పాటు మొబైల్ ఫోన్ ను చోరీ చేసి అక్కడ్నించి పరారయ్యారు. సీసీ కెమెరా ఫుటేజి పరిశీలిస్తే జంట దొంగల చేతివాటం వెల్లడైంది.

ఇంటి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా వినయ్, కీర్తనలను అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... వీళ్లిద్దరూ ప్రేమికులు. వినయ్ పై రౌడీషీట్ తో పాటు ఓ హత్యకేసు కూడా ఉంది. ఇవన్నీ తెలిసే కీర్తన అతడితో ప్రేమలో పడింది. వినయ్ కోసం తాను ఏమైనా చేస్తానని అంటోంది.

ఇక ప్రేయసికి బహుమతులు ఇచ్చేందుకు, ఆమెను విహార యాత్రలకు తీసుకెళ్లేందుకు డబ్బు కావాల్సి రావడంతో వినయ్ చోరీల బాట ఎంచుకున్నాడు. తనతోపాటు కీర్తనను కూడా దొంగతనాలకు తీసుకెళ్లేవాడు. ఇద్దరూ భార్యాభర్తల్లా నటించి ఇంటి యజమానులకు టోకరా వేసేవారు. మూడేళ్లుగా ఇదే పనిలో ఉన్న ఈ లవ్ జంట ఇన్నాళ్లకు పట్టుబడింది. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Vinay
Keerthana
Thieves
Lovers
Bengaluru

More Telugu News