RBI: ఆన్ లైన్ లో డబ్బు ట్రాన్స్ ఫర్ చేసే పరిమితిని రెట్టింపు చేసిన ఆర్బీఐ

RBI Keeps Key Rates At Same Point Governor Announces MPC Decisions
  • ఐఎంపీఎస్ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
  • ఆఫ్ లైన్ విధానంలో డిజిటల్ పేమెంట్లు ప్రారంభించేందుకు సిఫార్సు
  • కీలక వడ్డీరేట్లన్నీ యథాతథం
  • వరుసగా ఎనిమిదోసారీ మార్పుల్లేవు
ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథ స్థితిని కొనసాగించింది. వరుసగా ఎనిమిదో సారి వడ్డీరేట్లను మార్చకపోవడం గమనార్హం. రెపోరేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్దే ఉంచింది.

అంతేగాకుండా ఆన్ లైన్ లో డబ్బును ట్రాన్స్ ఫర్ చేసే పరిమితినీ పెంచింది. ఐఎంపీఎస్ (ఇమీడియట్ పేమెంట్స్ సర్వీస్) ద్వారా ఇప్పుడున్న రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ విధానంలో రిటైల్ డిజిటల్ పేమెంట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిఫార్సులు చేసింది.

ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇవాళ ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నా, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసమే వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకే ఈ నిర్ణయమని చెప్పారు.

ఆర్బీఐ గవర్నర్ వెల్లడించిన మరిన్ని వివరాలు..

  • ఆర్థిక వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనా. 2023 తొలి త్రైమాసిక వృద్ధి రేటు 17.1 శాతం లక్ష్యంగా నిర్దేశం.
  • చివరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నాటితో పోలిస్తే భారత్ ఆర్థికంగా మెరుగ్గా ఉంది.
  • ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలోనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతం నుంచి 5.3 శాతానికి సవరణ. జులై–సెప్టెంబర్ మధ్య అంచనాల కన్నా తక్కువగా నమోదు. అక్టోబర్–డిసెంబర్ కు గానూ 5.3 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింపు.
  • ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డ్ స్థాయిలో జరిగింది. దాని వల్ల ఆహార ద్రవ్యోల్బణంలో స్థిరత్వం.
  • వృద్ధికి సరపడా ద్రవ్య లభ్యతకు హామీ.
  • కరోనా లాక్ డౌన్ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడు జోరందుకున్నాయి. పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే గిరాకీ పుంజుకుంటోంది. పండుగ సీజన్ లో అది మరింత పెరిగే అవకాశముంది.
  • ఎన్ఎఫ్బీసీల్లో పెద్ద కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గతంగా అంబుడ్స్ మన్ ఏర్పాటు.
RBI
Governor
Shaktikanta Das
Interest Rates
IMPS

More Telugu News