TS High Court: అత్యాచారానికి గురైన బాలిక గర్భాన్ని తొలగించుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి

TS High Court Orders Koti Hospital doctors to abortion girl child
  • సమీప బంధువు అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన బాలిక
  • అబార్షన్ చేసేందుకు నిరాకరించిన కోఠి ఆసుపత్రి వైద్యులు
  • హైకోర్టును ఆశ్రయించిన బాలిక
  • పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలికి కల్పించిన హక్కులకే ప్రాధాన్యమన్న ధర్మాసనం
అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బాధిత బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలంటూ కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అబార్షన్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సమీప బంధువు ఒకరు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. అబార్షన్ చేయాలని కోరగా, కోఠి ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో బాధిత బాలిక తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన హైకోర్టు బాలిక ఆరోగ్య పరిస్థితిపై కమిటీ వేయగా, పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె గర్భంలో 25 వారాల వయసున్న పిండం ఉన్నట్టు నిర్ధారించారు. కొన్ని జాగ్రత్తలతో అబార్షన్ చేయవచ్చని కోర్టుకు కమిటీ తెలిపింది.

బాలికకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిస్తూ.. నిపుణుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అబార్షన్ చేయాలని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి కోఠి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఓ దురదృష్టకర ఘటన కారణంగా వచ్చిన అవాంఛనీయ గర్భాన్ని తొలగించకపోతే అది ఆ బాలికపై తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి కలిగించి, ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, పిండం నుంచి రక్తం, కణజాలం, డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని, నివేదికను దర్యాప్తు అధికారులకు అందజేయాలని ఆదేశించింది.
TS High Court
Rape Victim
Abortion

More Telugu News