IPL 2021: చివరి లీగ్ మ్యాచ్‌లో దుమ్ములేపిన కోల్‌కతా, చిత్తుగా ఓడిన రాజస్థాన్.. ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు

KKR Enters Playoffs with clinical win against Rajasthan
  • తొలుత బ్యాట్‌తో, ఆ తర్వాత బంతితో అదరగొట్టిన కోల్‌కతా
  • నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టిన శివమ్ మావి
  • ఐపీఎల్‌లో నేటి రెండు మ్యాచ్‌లు నామమాత్రమే
ఐపీఎల్‌లో భాగంగా గతరాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్బుత ప్రదర్శన చేసింది. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఫలితంగా ఈ బెర్తు కోసం ఎదురు చూస్తున్న ముంబై ఇండియన్స్ ఆశలు అడియాసలే అయ్యాయి. ఫలితంగా నేడు జరగనున్న రెండు మ్యాచ్‌లు నామమాత్రమే కానున్నాయి.

 ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ముంబై విజయం సాధించినా ప్లే ఆఫ్స్ అవకాశం లేదు. ఎందుకంటే, కోల్‌కతా నెట్ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి నేడు జరగనున్న రెండు మ్యాచ్‌లు నామమాత్రమే కానున్నాయి. ఒకవేళ ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే దాదాపు 171 పరుగుల తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. అది సాధ్యమయ్యే పనికాదు. కాబట్టి కోల్‌కతాదే ప్లే ఆఫ్స్ బెర్త్.

ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభమన్‌గిల్ 56, వెంకటేశ్ అయ్యర్ 38, నితీశ్ రాణా 12, త్రిపాఠి 21 పరుగులు చేయగా, కార్తీక్ 14, కెప్టెన్ మోర్గాన్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

అనంతరం 172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌పై కోల్‌కతా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా శివమ్ మావీ, లాకా ఫెర్గ్యసన్‌లు బంతితో చెలరేగిపోయారు. ఎడాపెడా వికెట్లు తీస్తూ బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వలేదు. ఫలితంగా మరో 3.5 ఓవర్లు మిగిలి ఉండగానే 85 పరుగులకు రాజస్థాన్ ఆలౌటై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. రాజస్థాన్ జట్టులో రాహుల్ తెవాటియా 44 పరుగులు చేయగా, శివమ్ దూబే 18 పరుగులు చేశాడు. జట్టులో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. 8 మంది ఆటగాళ్లు కలిసి చేసిన పరుగులు 22 మాత్రమే.

దీనిని బట్టి రాజస్థాన్ బ్యాటింగ్‌ను కోల్‌కతా బౌలర్లు ఎలా కకావికలం చేశారో అర్థం చేసుకోవచ్చు. శివమ్ మావీ నాలుగు, ఫెర్గ్యూసన్ 3 వికెట్లు తీసుకున్నారు. శివమ్ మావీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌లు నామమాత్రమే కానున్నాయి.
IPL 2021
Rajasthan Royals
Kolkata Knight Riders
Mumbai Indians

More Telugu News