Tamilnadu: కేన్సర్‌తో కుమారుడి నరకయాతన.. తట్టుకోలేక విషమిచ్చి చంపేసిన తండ్రి

Father kills cancer suffering son with poison injection
  • తమిళనాడు సేలంలో వెలుగు చూసిన ఘోరం
  • ల్యాబ్‌లో పనిచేసే బంధువు సాయంతో తండ్రి ఘాతుకం
  • కేన్సర్‌తో మరణించాడని నమ్మించే యత్నం
కుమారుడు కేన్సర్‌తో బాధపడుతూ, నరకయాతన పడడం చూడలేకపోయాడా తండ్రి. దీంతో దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ల్యాబ్‌లో పనిచేసే బంధువుతో విషం ఇంజెక్షన్ తెప్పించి, కుమారుడికి ఇచ్చాడు. నిద్రలోనే మరణించిన కుమారుడు కేన్సర్‌తో చనిపోయాడని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ద్వారా ఈ సమాచారం పోలీసులకు అందింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అలాగే మృతుడి తండ్రిని, అతనికి సహకరించిన బంధువును అదుపులోకి తీసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. సేలంలోని ఎడపాడి ప్రాంతానికి చెందిన పెరియ స్వామికి ఒకే ఒక కుమారుడు. 14 ఏళ్ల అతనికి కొన్ని రోజుల క్రితం కాల్లో కణితి బయటపడింది.

ఆసుపత్రికి తీసుకెళ్తే దాన్ని కేన్సర్ కణితిగా వైద్యులు గుర్తించారు. దీనికి చికిత్స చేయించడానికి స్వామి ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు. ప్రతిరోజూ కేన్సర్‌తో కుమారుడు పడుతున్న నరకం కూడా చూడలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ల్యాబ్‌లో పనిచేస్తున్న ప్రభు అనే బంధువు సాయంతో విషం ఇంజెక్షన్ తెప్పించాడు. నిద్రలో ఉండగా కుమారుడికి ఇంజెక్ష్ ఇచ్చేశాడు.

ఆ బాలుడు నిద్రలోనే మరణించాడు. చుట్టుపక్కల వారిని తన బిడ్డ కేన్సర్‌తోనే మరణించినట్లు నమ్మించాడు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి స్వామిని, ప్రభును అదుపులోకి తీసుకున్నారు.
Tamilnadu
Crime News

More Telugu News