Ladakh: సరిహద్దుల్లో మరోసారి చైనా సైన్యం మోహరింపు.. స్పందించిన భారత ఆర్మీ చీఫ్

China army at Indian border near ladakh
  • లడఖ్ పరిసర ప్రాంతాల్లో చైనా సైన్యం మోహరింపులు 
  • నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తంగా ఉన్నామన్న ఆర్మీ దళాధిపతి 
  • ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కుంటామన్న నరవణే

భారత సరిహద్దుల్లో డ్రాగన్ దేశం కదలికలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. లడఖ్ పరిసర ప్రాంతాల్లో చైనా మరోసారి బలగాలను మోహరిస్తోందని, మౌలికసదుపాయాలు ఏర్పాటు చేసుకుంటోందని భారత సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణే తెలిపారు. చైనా కదలికలను చూసి భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి పరిస్థితులు తలెత్తినా తట్టుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా లడఖ్‌లో భారీ ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నరవణే మీడియాతో మాట్లాడారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇప్పటి వరకూ 12 సార్లు ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరిగాయని ఆయన చెప్పారు. త్వరలోనే 13వ రౌండ్ చర్చలు జరుగుతాయన్నారు. కానీ కొన్ని రోజులుగా తూర్పు లడఖ్, ఉత్తర ఫ్రంట్ ప్రాంతాల్లో చైనా సైనిక చర్యలు పెరిగాయని తెలిపారు.

ఇలా భారత తూర్పు కమాండ్ సమీపంలో చైనా సైన్యం కదలికలు ఆందోళనకరమే అని ఆయన అన్నారు. అయితే తాము ప్రస్తుతానికి పరిస్థితిని గమనిస్తున్నామని, నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయుధాలను సమకూర్చుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News