Telangana: భర్తను కిడ్నాప్ చేయించి బలవంతంగా విడాకులు.. ప్రియుడితో కలిసి వివాహిత దారుణం

Wife kidnapped husband with the help of lover
  • హైదరాబాద్‌లోని మౌలాలిలో ఘటన
  • సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తితో  ప్రేమ
  • ప్రియుడికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు, పిల్లలు
  • విడాకుల కోసం భర్తపై ఒత్తిడి
  • కాదన్నందుకు ప్రియుడితో కలిసి పథకం
ప్రియుడితో కలిసి జీవితాన్ని పంచుకోవడం కోసం ఓ వివాహిత దారుణానికి తెగబడింది. అతడితో కలిసి భర్తను కిడ్నాప్ చేయించిన ఆమె బలవంతంగా విడాకులు తీసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్‌వాజీద్ (31), ఆప్షియా బేగం (24) భార్యాభర్తలు. వీరికి 2012లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాజీద్ ఓ చెప్పుల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు.

ఆప్షియాకు సోషల్ మీడియా ద్వారా క్యాటరింగ్ పనులు చేసే అసిఫ్ పరిచయమయ్యాడు. అతడికి ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. అసిఫ్‌తో పరిచయం మరింత ముదిరి అతడిని విడిచి ఉండలేని స్థితికి చేరుకున్న బేగం ఏప్రిల్‌లో ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను గుర్తించి తిరిగి వాజీద్‌ చెంతకు చేర్చారు. అయినప్పటికీ బుద్ధిమార్చుకోని బేగం మరోమారు అతడి వద్దకు వెళ్లిపోయింది. ఈసారి అత్తమామల సాయంతో తిరిగి తీసుకొచ్చారు.

తాను భర్తతో కలిసి ఉండలేనని, తనకు విడాకులు ఇప్పించాలని ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకు అతడు అంగీకరించలేదు. దీంతో ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్‌కు ప్లాన్ వేసింది. ఈ క్రమంలో సోమవారం అసిఫ్.. ముషీరాబాద్, పార్శీగుట్టకు చెందిన ఇమ్రాన్ మహ్మద్ (31), ఎండీ జాఫర్ (33), ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్‌లతో కలిసి బైక్‌పై వాజిద్ పనిచేసే చెప్పుల దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి అతడిని బలవంతంగా తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అనంతరం అప్పటికే సిద్ధంగా ఉంచిన మతపెద్దల సమక్షంలో విడాకులు ఇప్పించారు.

మరోవైపు, తమ షాపు నుంచి వాజిద్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన విషయాన్ని చెప్పుల దుకాణ యజమాని మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాజిద్ ఫోన్ లొకేషన్ ఆధారంగా అతడిని కాపాడారు. ఆయన భార్య ఆప్షియా బేగం, ఇమ్రాన్ అహ్మద్, జాఫర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి అసిఫ్‌, ఇర్ఫాన్ అహ్మద్, మహమూద్‌ల కోసం గాలిస్తున్నారు.
Telangana
Hyderabad
Kidnap
Wife
Husaband
Crime News

More Telugu News