Manchu Vishnu: పవన్ కల్యాణ్ తో నేను ఏకీభవించను.. ఆయన ప్రశ్నలకు మా నాన్న సమాధానాలు ఇస్తారు: మంచు విష్ణు

I will not accept Pawan Kalyans comments says Manchu Vishnu
  • 'మా' ఎన్నికలకు నామినేషన్లు వేసిన మంచు విష్ణు అండ్ టీమ్
  • మా మేనిఫెస్టో చూస్తే చిరంజీవి కూడా మాకే ఓటు వేస్తారన్న విష్ణు
  • ఎన్నికల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని వ్యాఖ్య
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్న ప్రారంభమయింది. నిన్న ప్రకాశ్ రాజ్, ఆయన ప్యానల్ సభ్యులు నామినేషన్లు వేశారు. ఈరోజు మంచు విష్ణు, ఆయన ప్యానల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. తన నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు భారీ ర్యాలీతో ఆయన వచ్చారు. ఛాంబర్ ప్రాంగణంలో ఉన్న దివంగత దాసరి నారాయణరావుకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నామినేషన్ వేశారు.

నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రతి తెలుగు నటుడి ఆత్మగౌరవ పోరాటమని చెప్పారు. తమ మేనిఫెస్టోను చూశాక చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా తనకే ఓటేస్తారని అన్నారు. ప్రకాశ్ రాజ్ సినీ పరిశ్రమ వైపు ఉన్నారా? లేక పవన్ కల్యాణ్ వైపు ఉన్నారా? అని ప్రశ్నించారు. సినిమా టికెట్లను ఆన్ లైన్లో అమ్మాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు సరికాదని చెప్పారు. పవన్ కామెంట్స్ తో ఇండస్ట్రీ ఏకీభవించలేదని, తాను కూడా ఏకీభవించడం లేదని అన్నారు.

ఏపీ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ రాసిన లేఖను సమర్థిస్తున్నానని విష్ణు చెప్పారు. చిరంజీవి, నాగార్జున వంటి సినీ ప్రముఖులు చెపితేనే టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు మంత్రి పేర్ని నాని చెప్పారని... మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పరు కదా? అని అన్నారు. దీనిపై ఇంత వరకు చిరంజీవి బహిరంగంగా మాట్లాడలేదని... 'మా' జీబీఎంలో సినీ పెద్దలు దీనిపై స్పందించే అవకాశం ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్ అడిగిన ప్రతి ప్రశ్నకు తన తండ్రి మోహన్ బాబు సమాధానాలు చెపుతారని అన్నారు. 'మా' ఎన్నికల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని ఆయన కోరారు. 
Manchu Vishnu
Pawan Kalyan
Chiranjeevi
Mohan Babu
Tollywood
MAA
Janasena

More Telugu News