Husband and Wife: రోజూ 'స్నానం' గొడవతో విడాకులు కోరుతున్న భర్త!

police shocked to know this husband reason for divorce
  • రోజూ స్నానం చేయకుండా గొడవ పడుతోందని భర్త గొడవ
  • తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని భార్య ఫిర్యాదు
  • ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరగడం తెలిసిందే. కానీ ఇవి విడాకుల వరకూ వెళ్లడం చాలా అరుదు. అయితే తాజాగా ఒక వ్యక్తి భార్యపై సరికొత్త కారణంతో ఆగ్రహించి, విడాకులు కావాలంటున్నాడు. అనడమే కాదు.. మూడుసార్లు తలాక్ కూడా చెప్పేశాడు. ఇంతకీ.. అతను విడాకుల కోసం చెబుతున్న కారణం ఏంటో తెలుసా? భార్య రోజూ స్నానం చేయడం లేదట! ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో వెలుగు చూసింది.

స్థానిక చందోస్ గ్రామానికి చెందిన వ్యక్తికి, క్వార్సీ గ్రామానికి చెందిన మహిళకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఏడాది వయసున్న పాప కూడా ఉంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆ యువతి 'అలీఘర్ వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌'కు తన భర్తపై ఫిర్యాదు చేసింది. భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని, అయితే తనకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌ వారు వెంటనే రంగంలోకి దిగి భర్తను పిలిపించారు. భార్య రోజూ స్నానం చేయడం లేదని, చేయాలని చెబితే తనతో గొడవ పడుతోందని ఆ భర్త ఆమెపై ఫిర్యాదు చేశాడు. తనకు ఇక ఆమెతో కలిసి ఉండటం ఇష్టం లేదని స్పష్టం చేశాడు. ఆమె మాత్రం తాను భర్తతోనే కలిసి ఉంటానని అంటోంది.

విడాకుల కారణం తెలుసుకున్న వుమెన్ ప్రొటెక్షన్ సెల్‌ వారు ఈ కాపురాన్ని నిలపడానికి నడుం బిగించి, భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే, సదరు భర్త మాత్రం ఆమెతో కలిసి వుండడానికి ససేమిరా అంటున్నాడు. అంతేకాదు, రోజూ స్నానం చేయలేని భార్యతో తాను కాపురం చేయలేనని, త్వరగా విడాకులు ఇప్పించి, పుణ్యం కట్టుకోవాలని కోరుతూ వుమెన్ ప్రొటెక్షన్ సెల్ కి తనూ ఓ దరఖాస్తు ఇచ్చేశాడు.

అయితే, విడాకుల కోసం భర్త చెప్పిన కారణం ఏ హింసాత్మక చట్టం, మహిళలపై నేరం కిందకు రాదు కాబట్టి పిటిషన్ ముందుకు పోదని వివరించారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలకు వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని హితవు పలికారు. అనంతరం భార్యాభర్తలిద్దరికీ కొంత సమయం ఇచ్చి ఆలోచించుకోవాలని చెప్పారు.
Husband and Wife
Divorce
Uttar Pradesh

More Telugu News