JamesBond: ‘జేమ్స్ బాండ్’ నటుడికి అరుదైన గౌరవం

Jamesbond actor Daniel Craig becomes honorary commander at British Royal Navy
  • బ్రిటిష్ రాయల్ నేవీలో ఆనరరీ కమాండర్ స్థానం
  • సినిమాల్లో 15 ఏళ్లుగా కమాండర్ బాండ్‌గా నటిస్తున్న డేనియల్ క్రెగ్
  • మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ‘నో టైం టు డై’
  • జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో క్రెగ్ చివరి చిత్రమంటూ వదంతులు
‘జేమ్స్ బాండ్’ నటుడు డేనియల్ క్రెగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ను బ్రిటిష్ నేవల్ ఆర్మీలో ఆనరరీ కమాండర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడిచిన 15 ఏళ్లుగా  జేమ్స్‌బాండ్‌గా ప్రేక్షకులను క్రెగ్ అలరిస్తున్నాడు. ఈ చిత్రాల్లో బ్రిటిష్ రాయల్ నేవీలో కమాండర్‌గానే నటిస్తున్నాడు.

అతనికి ఈ అరుదైన గౌరవం లభించిన సందర్భంగా ఫస్ట్ సీ లార్డ్ అడ్మైరల్ సర్ టోరీ రాడకిన్ స్పందిస్తూ, ‘‘అంతర్జాతీయంగా వివిధ మిషన్లు పూర్తి చేస్తూ బ్రిటన్ దేశాన్ని శత్రువుల నుంచి కాపాడే కమాండర్ బాండ్‌గా గడిచిన 15 ఏళ్లుగా డేనియల్ క్రెగ్ పేరొందాడు’’ అంటూ కొనియాడారు. రాయల్ నేవీ యూనిఫాంలో క్రెగ్ ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

తనకు ఈ గౌరవం దక్కడంపై డేనియల్ కూడా స్పందించాడు. తనకు దక్కిన గొప్ప గౌరవం ఇదని చెప్పాడు. జేమ్స్‌బాండ్‌గా డేనియల్ క్రెగ్ నటించిన తాజా చిత్రం ‘నో టైం టు డై’ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం అక్టోబరు 8న విడుదల అవుతుంది. సెప్టెంబరు 28న యూకేలో ప్రీమియర్స్ జరుగుతాయి. బాండ్ ఫ్రాంచైజీలో క్రెగ్ నటించే చివరి సినిమా ఇదేనంటూ ఇప్పటికే కొన్ని వదంతులు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
JamesBond
Daniel Craig
British Royal Navy
UK
Hollywood

More Telugu News