ఎస్పీ బాలుపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- ఢిల్లీలో అంతర్జాతీయ సంగీత సమ్మేళనం
- హాజరైన వెంకయ్యనాయుడు
- పిల్లల్లో బాలు సంస్కార బీజాలు నాటే ప్రయత్నం చేశారని వెల్లడి
- బాలు వినమ్రత ఎందరికో ఆదర్శమని కితాబు
బాలు... గతం, వర్తమాన, భవిష్యత్ కాలాల మధ్య స్వర, సంస్కార వారధి వంటి వాడని వెంకయ్యనాయుడు కొనియాడారు. బాలు వినమ్రత ఎందరికో ఆదర్శం అని పేర్కొన్నారు. ఆ మహాగాయకుడి పాట నుంచే కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాల గురించి వారి మాట నుంచి కూడా ఈ తరం యువత, కళాకారులు స్ఫూర్తిపొందాలని సూచించారు.
బాలు జీవితం సినీ సంగీత చరిత్రలో ఓ మైలురాయి వంటిదని పేర్కొన్నారు. కథానాయకుల గాత్రంలోకి పరకాయ ప్రవేశం చేసి పాటలు పాడే బాలు ప్రతిభ అపురూపమైనదని కీర్తించారు. తెలుగు ప్రజల జీవితాల్లోనూ, ఆలయ సుప్రభాత సంగీత నివేదనల్లోనూ ఆయన స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుందని కొనియాడారు.