Corona Virus: వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే కరోనా వ్యాక్సిన్లు

Center to vaccinate elderly and disabled people at home
  • భారత్ లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • కేసులు తగ్గుతున్నాయన్న కేంద్రం
  • అయితే సెకండ్ వేవ్ మధ్యలోనే ఉన్నామని వెల్లడి
  • కేరళలో పరిస్థితిపై ఆందోళన
భారత్ లో కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ, దేశంలో వ్యాక్సినేషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దే కొవిడ్ వ్యాక్సిన్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 18 ఏళ్లకు పైబడిన వారిలో 66 శాతం మంది కనీసం ఒక్క డోసు తీసుకున్నారని, 23 శాతం మంది రెండు డోసులు పొందారని వివరించారు.

అటు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ...   దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని, ఇంకా మధ్యలోనే ఉన్నామని వెల్లడించారు. ఈ దశలో నిర్లక్ష్యానికి తావివ్వరాదని, మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం వంటి మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

కేంద్ర ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్ నేడు ఢిల్లీలో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి. దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతోందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే కేరళలో పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉందని, దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం కేరళ నుంచేనని తెలిపారు. దేశంలో పాజిటివిటీ రేటు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
Corona Virus
Vaccine
Elderly People
Disabled People
India

More Telugu News