Bandi Sanjay: సీఎంను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా.. దమ్ముంటే నాపై పెట్టండి: బండి సంజయ్ సవాల్

Bandi Sanjay Fires KCR and KTR
  • హామీలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూనే ఉంటాం
  • తొలుత కేసీఆర్, కేటీఆర్‌పైనే రాజద్రోహం కేసులు పెట్టాలి
  • కాంగ్రెస్, టీఆర్ఎస్ వైట్ చాలెంజ్ నాటకాలు
హామీలు ఇచ్చి, నెరవేర్చని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతామని కేటీఆర్ బెదిరిస్తున్నారని, దమ్ముంటే తనపై పెట్టాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ సవాలు విసిరారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిన్న కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రజాద్రోహంపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. సీఎంను ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతామని కేటీఆర్ చెప్పారని, దమ్ముంటే తనపై కేసు పెట్టాలని సవాలు విసిరారు.

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించని కేసీఆర్, కేటీఆర్‌పైనే తొలుత రాజద్రోహం కేసులు పెట్టాలని అన్నారు. ఆయనతో ఉంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాద్రోహ ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. పోడు సమస్యను పరిష్కరించకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తే మోదీకి ఎక్కడ పేరు వస్తుందోనని ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఇక, డ్రగ్స్‌పై కొండా విశ్వేశ్వరరెడ్డి తనకు విసిరిన సవాలుకు తాను సిద్ధమేనని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకే వైట్ చాలెంజ్ పేరుతో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని సంజయ్ ధ్వజమెత్తారు.
Bandi Sanjay
KCR
KTR
TRS
BJP

More Telugu News