KCR Temple: నాడు కేసీఆర్ కు గుడి కట్టాడు... ఇప్పుడు బాధతో అమ్మేస్తానంటున్నాడు!

KCR temple for sale in Telangana
  • మంచిర్యాల జిల్లాలో ఘటన
  • రవీందర్ కేసీఆర్ కు వీరాభిమాని
  • తెలంగాణ అంటే ప్రాణం
  • సొంతూర్లో రూ.3 లక్షలతో కేసీఆర్ కు గుడి
  • వ్యాపారానికి ప్రత్యర్థుల నుంచి విఘాతం
  • టీఆర్ఎస్ తనను పట్టించుకోలేదని రవీందర్ ఆవేదన
కొందరు వ్యక్తులు తమ అభిమాన రాజకీయ నాయకులకు, సినీతారలకు గుడులు కట్టడం తెలిసిందే. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ కూడా ఈ కోవకు చెందినవాడే. సీఎం కేసీఆర్ కు వీరాభిమాని. కేసీఆర్ పిలుపు మేరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని బైండోవర్ కేసులను సైతం ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రవీందర్ తన స్వగ్రామంలో రూ.3 లక్షలతో కేసీఆర్ కు గుడి కట్టాడు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను కూడా ఏర్పాటు చేశాడు. కేసీఆర్ ను దైవంగా భావించి నిత్యం పూజలు చేస్తూ తన వీరభక్తిని చాటుకునేవాడు.

అయితే కాలక్రమంలో పరిస్థితి మారింది. సొంత ఊరిలో కేబుల్ నెట్ వర్క్ వ్యాపారం చేసే రవీందర్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన వ్యాపారాన్ని ఇతరులు హస్తగతం చేసుకున్నారు. దాంతో తనను ఆదుకోవాలని, న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ అనేక పర్యాయాలు ప్రగతి భవన్ కు వచ్చాడు. కేసీఆర్, కేటీఆర్ లను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరికి కేసీఆర్ కు తాను కట్టిన గుడి ఎదుట ధర్నా చేసినా ఫలితం లేకపోయింది. చేసేదిలేక టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరాడు.

తాజాగా కేసీఆర్ గుడిని అమ్మేస్తానంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడంతో అందరి దృష్టి గుండ రవీందర్ పై పడింది. టీఆర్ఎస్ నేతలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం మంచి పనిచేస్తున్నావంటూ రవీందర్ ను అభినందిస్తున్నారు.  

కొన్ని రాజకీయ శక్తులు తన కేబుల్ వ్యాపారాన్ని దెబ్బతీశాయని, టీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకు న్యాయం జరగలేదని అతడు వాపోయాడు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన రవీందర్, తన ఫోన్ నెంబరు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో, కొందరు వ్యక్తులు కేసీఆర్ గుడిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, భవిష్యత్తులో ఏంజరుగుతుందో చూడాలని వ్యాఖ్యానించాడు.

గుండ రవీందర్ ఫేస్ బుక్ ఖాతా
KCR Temple
Gunda Ravindar
Mancherial District
TRS
Telangana

More Telugu News