Hyderabad: వరుడు నచ్చలేదట.. పెళ్లయిన గంటకే డబ్బులు, నగలతో ప్రియుడితో కలిసి నవ వధువు పరార్!

Hyderabad bride elopes with lover after marriage with cash and jewellery
  • బెంగళూరు వ్యాపారితో ఫలక్‌నుమా యువతికి వివాహం
  • మొహర్‌గా రూ. 50 వేలు, నగలు ఇవ్వాలని డిమాండ్
  • ఇచ్చాక బ్యూటీపార్లర్‌కు వెళ్లొస్తానని అదృశ్యం
  • తన డబ్బులు, నగలు ఇచ్చేస్తే చాలన్న వరుడు
వివాహమై గంట కూడా కాలేదు. వరుడు నచ్చలేదంటూ ఓ నవ వధువు డబ్బులు, నగలు తీసుకుని ప్రియుడితో ఉడాయించింది. అంతేకాదు, తన కోసం వెతకొద్దని, ప్రియుడితో కలిసి వెళ్లిపోతున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనతో వరుడి కుటుంబం షాక్‌కు గురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి (30)కి హైదరాబాద్, ఫలక్‌నుమా ప్రాంతంలోని  యువతి (20)తో వివాహం నిశ్చయమైంది.  ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉండగా, వరుడి కుటుంబం అదే రోజు రావడంతో 17న సాయంత్రం బాలాపూర్ పరిధిలోని వధువు బంధువుల ఇంట్లో వివాహం జరిపించారు.

పెళ్లితంతు పూర్తికావడంతో వధువును తీసుకుని బెంగళూరు వెళ్లేందుకు వరుడి కుటుంబ సభ్యులు రెడీ అయ్యారు. అయితే, నవ వధువుకు మొహర్‌గా రూ. 50 ఇప్పించాలని, ఆమెకు పెట్టాల్సిన నగలన్నీ అక్కడే ఆమెకు ఇవ్వాలని మౌల్వీ పట్టుబట్టాడు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు అలాగే చేశారు. అనంతరం వధువు తాను బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పింది. ఇందుకు భర్త సహా ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో అన్న, వదినతో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది.

బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆమె వారి కన్నుగప్పి అదృశ్యమైంది. ఆమె అన్నా, వదిన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ తర్వాత గంటకే వధువు తన అమ్మమ్మకు ఫోన్ చేసి భర్త తనకు నచ్చలేదని, కాబట్టి ప్రియుడితో వెళ్లిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేసింది. విషయం తెలియడంతో వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. పథకం ప్రకారమే పెళ్లి చేసి డబ్బులు, నగలు ఇప్పించిన తర్వాత ప్రియుడితో పంపించి వేశారని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ డబ్బు, నగలు వెనక్కి ఇచ్చేస్తే వెళ్లిపోతామని పట్టుబట్టారు. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Hyderabad
Bengluru
Marriage
Elope
Bride

More Telugu News