Corona Virus: బూస్టర్ డోస్ ఆలోచన ప్రస్తుతానికి లేదు: కేంద్రం

booster dose not in the main theme of government plan
  • ప్రస్తుతానికి రెండు డోసులు అందించడంపైనే దృష్టి
  • దేశ జనాభాలో 20 శాతం పెద్దవారికి అందిన రెండు డోసులు
  • 99 శాతం ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి
  • స్పష్టంచేసిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బూస్టర్ డోస్ గురించి చర్చ జరుగుతోంది. వైద్య పరిశోధకులు దీనిపై భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇప్పుడే బూస్టర్ డోస్ అవసరం లేదని చెబుతోంది. ఈ క్రమంలో భారత్‌లో ప్రజలకు బూస్టర్ డోస్ ఇచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ఆరోగ్యశాఖ బదులిచ్చింది.

ప్రస్తుతానికైతే శాస్త్రవేత్తలు కానీ, ప్రజారోగ్య విభాగంలో కానీ ఈ అంశంపై ఎటువంటి చర్చా జరగడం లేదని స్పష్టం చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ఈ విధంగా సమాధానమిచ్చారు. ‘‘శాస్త్రీయంగా కానీ, ప్రజారోగ్య విభాగంలో కానీ ప్రస్తుతం బూస్టర్ డోస్ ప్రధానమైన చర్చనీయాంశం కాదు. రెండు డోసులు అందరికీ అందేలా చూడటమే ప్రధాన లక్ష్యం’’ అని ఆయన తెలిపారు.

ఇప్పటి వరకూ దేశ జనాభాలోని 20 శాతం వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ అందినట్లు భార్గవ వెల్లడించారు. ఆరోగ్య సిబ్బందిలో 99 శాతం కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని, అర్హులైన 82 శాతం మంది రెండో డోసు కూడా అందుకున్నారని చెప్పారు.

ఫ్రంట్ లైన్ వర్కర్లలో 100 శాతం మందికి తొలి డోస్ అందినట్లు తెలిపారు. 78 శాతం మంది రెండో డోసు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, గోవా, చండీగఢ్, లక్షద్వీప్‌లోని వయోజనులందరూ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Corona Virus
Vaccine
Booster Dose
Health Ministry

More Telugu News