YouTube: కెమెరా వైపు చూస్తూ ఏడుస్తున్నట్టు నటించాలంటూ.. పిల్లాడికి చెబుతూ దొరికిపోయిన యూట్యూబర్!

youtuber caught saying act like you are crying to son
  • కాలిఫోర్నియాకు చెందిన జోర్డాన్ చెయెన్నే వీడియోపై విమర్శలు
  • కుక్కపిల్లకు పార్వోవైరస్ వచ్చిందని యూట్యూబ్ వీడియో
  • ఏడేళ్ల కుమారుడిని ఏడవాలంటూ సూచనలు
  • క్షమాపణలు చెప్పి ఛానెల్ డిలీట్ చేసిన యూట్యూబర్
ప్రస్తుత కాలంలో తమకు ఎదురయ్యే ప్రతి అనుభవాన్నీ ప్రపంచంతో పంచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. తద్వారా సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి, సెలెబ్రిటీగా మారడానికి నానాతిప్పలూ పడుతున్నారు. ఇలాగే చేయబోయి అడ్డంగా బుక్కయిందో యూట్యూబర్. ఆమె కాలిఫోర్నియాకు చెందిన జోర్డాన్ చెయెన్నే.

ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు 5 లక్షలమందికిపైగా సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇటీవల చేసిన ఒక వీడియో విమర్శల పాలవడంతో ఆమె తన ఛానెల్‌ను డిలీట్ చేసేసింది. తమ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కపిల్లకు పార్వోవైరస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకిందనీ, దాంతో గుండెపగిలి ఏడుస్తున్నామనీ చెబుతూ, ఆమె ఈ వీడియో చేసింది.

ఈ వీడియోలో ఏడేళ్ల తన కుమారుడితో కలిసి జోర్డాన్ కనిపించింది. ఆ సమయంలోనే వీడియో థంబ్‌నెయిల్ కోసం పుత్రుడిని ఏడుస్తున్నట్టు నటించాలంటూ సూచనలిచ్చింది. గట్టిగా ఏడవాలని, తనవైపు చూడాలని, కెమెరా వైపు చూస్తూ ఏడవాలని చెప్పింది. ఆమె ఒత్తిడి తట్టుకోలేని ఆ పిల్లాడు.. ‘‘ఏడుస్తున్నా మమ్మీ’’ అనడం కూడా ఈ వీడియోలో స్పష్టంగా వినిపించింది. పొరపాటున వీడియోను ఎడిట్ చేయకుండా ఆమె పోస్టు చేయడంతో ఇదంతా బయటపడింది.

ఆ వీడియో చూశాక తాను ఎంతో దిగజారినట్లు అనిపించిందని, కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని జోర్డాన్ తెలిపింది. పిల్లాడి మనోభావాలు పట్టించుకోకుండా తాను అలా ప్రవర్తించి ఉండకూడదని క్షమాపణలు చెప్పింది. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌ను డిలీట్ చేసేసింది. ఈ వీడియోపై చాలా మంది విమర్శలు చేశారు.
YouTube
Social Media
Viral Videos

More Telugu News