Warangal Rural District: రైల్వే ట్రాక్‌పై రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌నే మేము భావిస్తున్నాం: వ‌రంగ‌ల్‌ సీపీ

warangal cp on raju suicide
  • రైల్వే ట్రాక్‌ను ప‌రిశీలించిన సీపీ
  • మృత‌దేహాన్ని మొద‌ట రైల్వే కార్మికులు చూశారని వివ‌ర‌ణ‌
  • రాజు ఘ‌న్‌పూర్ స్టేష‌న్‌కు ఎలా వ‌చ్చాడో ద‌ర్యాప్తు  
హైద‌రాబాద్‌లోని సైదాబాద్ బాలిక‌ (6) హ‌త్యాచార‌ ఘ‌ట‌న నిందితుడు రాజు మృతదేహాన్ని వ‌రంగ‌ల్ పోలీసులు స్టేష‌న్ ఘ‌న్‌పూర్ వ‌ద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తించిన విష‌యం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని వ‌రంగ‌ల్ సీపీ త‌రుణ్ జోషి ప‌రిశీలించారు. ఈ రోజు ఉద‌యం 8.45 గంటల‌కు ఆ మృత‌దేహాన్ని కార్మికులు గుర్తించార‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. మొద‌ట రైల్వే అధికారులకు కార్మికులు స‌మాచారం ఇచ్చార‌ని, అనంత‌రం డ‌య‌ల్ 100 ద్వారా త‌మ‌కు స‌మాచారం అందింద‌ని వివరించారు.

దీంతో పోలీసులు అక్క‌డ‌కు వెళ్లి మృత‌దేహాన్ని ప‌రిశీలించి, అది రాజుదేన‌ని గుర్తించిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. హ‌త్యాచార నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌నే తాము భావిస్తున్నామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే, అతను ఘ‌న్‌పూర్ స్టేష‌న్‌కు ఎలా వ‌చ్చాడో ద‌ర్యాప్తు చేస్తామ‌ని తెలిపారు.
Warangal Rural District
Police
Crime News

More Telugu News