Revanth Reddy: ఇంత బాధ్యతారాహిత్యంగా కేటీఆర్ ఎలా ట్వీట్ చేశారు?: రేవంత్ రెడ్డి ఫైర్

Did KTR tweeted in intoxication asks Revanth Reddy
  • చిన్నారిపై హత్యాచారం చేసిన వ్యక్తిని పట్టుకున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు
  • ఆచూకీ తెలిపితే రూ. 10 లక్షలు ఇస్తామన్న పోలీసులు 
  • వ్యసనపరులకు తెలంగాణ స్వర్గధామంలా మారిపోయింది
వ్యసనపరులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంలా మారిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం మందిని తాగుబోతులుగా చేస్తోందని అన్నారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. మద్యం మత్తులోనే దారుణ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మహిళలపై అధిక దాడులు మద్యం కారణంగానే జరిగాయని పోలీసు రికార్డులు చెపుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,750 రేప్ కేసులు నమోదయ్యాయని రేవంత్ అన్నారు.

హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారని... ఆయన మద్యం మత్తులో ఉండి ఆ ట్వీట్ చేశారా? అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ట్వీట్ తర్వాత పోలీసులు... నిందితుడి ఆచూకీ తెలిపితే రూ. 10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారని అన్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా కేటీఆర్ ఎలా ట్వీట్ చేశారని మండిపడ్డారు.

రాష్ట్రంలో పెరిగిపోతున్న విష సంస్కృతిపై ముఖ్యమంత్రికి నిఘా విభాగాలు నివేదికలు ఇవ్వడం లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. డ్రగ్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని 9 దర్యాప్తు సంస్థలకు తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎల్లుండి (17వ తేదీ) కేంద్ర హోంమంత్రి అమిత్ రాష్ట్రానికి వస్తున్నారని... ఆయనను తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కలిసేందుకు తాను అపాయింట్ మెంట్ కోరానని తెలిపారు.
Revanth Reddy
Congress
KTR
TRS

More Telugu News