Andhra Pradesh: ప్రతి నెలా బ్రష్షూ, పేస్టూ ఇచ్చి వెళ్తారట.. మరి, టంగ్​ క్లీనర్​ ఇవ్వరా?: 'వైఎస్సార్​ చిరునవ్వు' పథకంపై రఘురామ వ్యంగ్యం

Raghu Rama Krishna Raju Satire On YSR Chirunavvu Scheme
  • టంగ్ క్లీనర్ కోసం జగనన్న సుశ్వాస పథకం తెస్తారేమో
  • ముందుగా రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని సూచన
  • పక్క రాష్ట్రంలో రేప్ జరిగితే సినీ పెద్దలు గొంతెత్తుతున్నారు
  • మరి, ఏపీలో జరిగిన ఘటనలపై ఎందుకు మాట్లాడట్లేదు?
వైఎస్సార్ చిరునవ్వు పథకంపై వైఎస్సార్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు గుప్పించారు. 'ప్రతి నెలా వలంటీర్లు బ్రష్షూ, పేస్టు ఇచ్చి వెళ్తారట' అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మరి, టంగ్ క్లీనర్ ఇస్తున్నారా? అని అడిగితే లేదన్నారంటూ కామెంట్ చేశారు. మంచి శ్వాసకు టంగ్ క్లీనర్ కూడా కావాలి కాబట్టి.. కొన్ని రోజుల తర్వాత జగనన్న సుశ్వాస పేరిట పథకం తీసుకొస్తారేమో అంటూ సెటైర్ వేశారు. సాక్షిలో పెద్ద యాడ్, మిగతా పేపర్లలో ఫార్మాలిటీకి ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేస్తారని అన్నారు.

ఈ పథకాలు ఎవరు అడిగారని, ముందు శాంతి భద్రతలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగున్నాయని సర్కార్ అంటోందని, మరి, కరోనా సోకిన బొత్స సత్యనారాయణ అపోలో ఆసుపత్రికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అపోలోకే వెళ్లారన్నారు. భవిష్యత్ లో హాస్పిటల్ హబ్స్ నిర్మిస్తామన్న రాష్ట్ర సర్కార్ ప్రకటనపై ఆయన మండిపడ్డారు.

బిగ్ బాస్ ను సీపీఐ నారాయణ బ్రోతల్ స్వర్గం అనడంపైనా విమర్శలు చేశారు. ప్రస్తుతం ఇంట్లో మహిళలందరూ బిగ్ బాస్ ప్రోగ్రామ్ నే చూస్తున్నారని అన్నారు. అంతకుమించిన సమస్యలున్నాయని గుర్తు చేశారు. వాటిపై పోరాడాలని హితవు చెప్పారు. పక్కరాష్ట్రంలో రేప్ జరిగితే గొంతెత్తే సినీ పెద్దలు.. ఏపీలో మాత్రం గొంతెత్తట్లేదని విమర్శించారు. ఏపీకి సజ్జనార్ లాంటి అధికారి అవసరం ఎంతో ఉందన్నారు. అలాంటి అధికారిని ఏపీకి తీసుకొస్తే.. రాష్ట్రంలో అరాచకాలు తగ్గే అవకాశం ఉందన్నారు.

పేర్ని నాని అబద్ధాలు చెప్పరని, ముక్కుసూటి మనిషి అని అన్నారు. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో ఇవ్వాలని, టికెట్ల ధరలను పెంచాలని చిరంజీవి, నాగార్జునలు కోరారనడం మాత్రం నమ్మబుద్ధి కావట్లేదని అన్నారు. చాలా మందికి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేయడం తెలియదని, అలాంటి వారు సినిమాలు ఎలా చూస్తారని ప్రశ్నించారు. బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినా పన్ను వసూళ్లు మాత్రం రాలేదనడం ప్రభుత్వ చేతగానితనమేనని ఆయన విమర్శించారు.
Andhra Pradesh
Telangana
Cine Industry
YSRCP
Raghu Rama Krishna Raju

More Telugu News