Crime News: కూతుర్ని ప్రేమించాడని కక్ష.. యువకుడిపై సుత్తి, రాడ్లతో దాడి.. వీడియో ఇదిగో!
- మధ్యప్రదేశ్‌లో ఘటన
- నడి వీధిలో బయటకు లాక్కొచ్చి దాడి
- యువకుడి కాలు, చేతికి తీవ్రగాయాలు
వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇంతలో వారి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసిపోయింది. తమ ప్రేమకు అడ్డుచెబుతుండడంతో పెద్దలను ఎదిరించైనా సరే ఒక్కటి కావాలనుకున్నారు. పెద్దలు తమ మాట వినకపోవడంతో వారికి దూరంగా వెళ్లి ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని అనుకున్నారు.
ఇళ్ల నుంచి పారిపోయి వేరే ప్రాంతంలో జీవించసాగారు. అయితే, వారితో సంప్రదింపులు జరిపిన యువతి తల్లిదండ్రులు తిరిగి ఇంటికి రావాలని, తాము ఏమీ అనబోమని చెప్పారు. తీరా ఆ ప్రేమ జంట ఇంటికి వచ్చాక అబ్బాయిపై యువతి కుటుంబ సభ్యులు సుత్తి, ఇనుపరాడ్లతో దాడి చేశారు.
ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలోని మక్సి నగరంలో చోటు చేసుకుంది. యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేస్తుండగా ఒకరు స్మార్ట్ ఫోన్‌లో ఆ దృశ్యాలు తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పుష్పక్ భావ్సర్(22) అనే యువకుడు ఓ యువతితో కలిసి పారిపోయి, పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి వచ్చేశాడు.
యువతి కుటుంబ సభ్యులు పుష్పక్‌పై కోపంతో రగిలిపోతూనే ఉన్నారు. పుష్పక్ తన ఇంటి సమీపంలో హెయిర్ కటింగ్ షాప్‌లో కటింగ్ చేసుకుంటున్న సమయంలో యువతి తండ్రి, సోదరుడు అతడి వద్దకు వచ్చారు. షాప్ నుంచి అతన్ని బయటకు లాక్కొచ్చి, నడి వీధిలో అందూ చూస్తుండగా సుత్తి, ఇనుప రాడ్‌తో దాడి చేశారు. దీంతో ఆ యుకుడి కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.