RBI: కేవైసీ మోసాలపై వినియోగదారులకు రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక
- గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలతో అప్రమత్తంగా ఉండాలి
- ఎస్ఎంఎస్, ఈమెయిల్స్‌కు స్పందించొద్దని సూచన
- ఖాతా వివరాలు తెలిసిన తర్వాత హ్యాక్ చేస్తారని హెచ్చరిక
ఇటీవలి కాలంలో కేవైసీ పేరుతో జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలు కేవైసీ అప్‌డేట్ పేరుతో చేసే కాల్స్, మెసేజిలు, ఈమెయిళ్లతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇలాంటి వాటికి స్పందించొద్దని, ఈ విధానాల్లో వినియోగదారుల బ్యాంకు ఖాతా వివరాలను హ్యాకర్లు కాజేస్తున్నారని తెలిపింది.
ఈ వివరాల సాయంతో సదరు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారని వివరించింది. కాబట్టి కేవైసీ అప్‌డేట్ పేరుతో ఎవరైనా వ్యక్తిగత, బ్యాంకు వివరాలు కోరితే.. వెంటనే తమ బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని సూచించింది. కొన్నిసార్లు వచ్చే మెసేజిలు, మెయిల్స్‌లో ఒక యాప్ లింక్ ఉంటుందని, ఆ యాప్ ద్వారా కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని సూచనలు ఉంటాయని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఇలాంటి యాప్స్‌లో కూడా బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది.
ప్రస్తుతం కేవైసీ ప్రక్రియను చాలా వరకు సులభతరం చేశామని చెప్పిన ఆర్బీఐ.. కేవైసీ అప్‌డేట్ చేసుకోలేదనే కారణంతో వినియోగదారుల ఖాతాలపై ఎటువంటి నిబంధనలూ పెట్టవద్దని ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు 2021 డిసెంబరు 31 వరకూ అమల్లో ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. ఏదైనా రెగ్యులేటరీ సంస్థ, కోర్టు తదితర అధికారిక సంస్థల సూచనల మేరకు తప్పితే కేవలం కేవైసీ అప్‌డేట్ జరగలేదనే కారణంతో వ్యక్తుల ఖాతాలపై నిబంధనలు విధించడం జరగదని ఆర్బీఐ పేర్కొంది.